Site icon TeluguMirchi.com

Arjun Sarja: యాక్షన్ కింగ్ ఇంట్లో పెళ్లి సందడి.. 13 ఏళ్ల ప్రేమకు త్వరలో పెళ్లి బంధం

Arjun Sarja

Arjun Sarja: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట త్వరలో పెళ్లి సందడి మొదలు కానుంది. ఆయన చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్న తన ప్రియుడినే అంజనా పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఆమె కాబోయే భర్త ఎవరనే విషయాన్ని మాత్రం కుటుంబం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అర్జున్ సర్జా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన 1988లో కన్నడ నటి నివేదితను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఐశ్వర్య, అంజనా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఐశ్వర్య ఇప్పటికే హీరోయిన్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టారు.

విశాల్ సరసన హీరోయిన్‌గా పరిచయమైన ఐశ్వర్య.. ఆ తర్వాత తన తండ్రి అర్జున్ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కిన ‘సొల్లివిడవా’ చిత్రంలోనూ నటించారు. ప్రస్తుతం ఆమె తండ్రి వ్యాపార వ్యవహారాలతో పాటు నిర్మాణ సంస్థకు సంబంధించిన పనులను చూసుకుంటున్నారు. మరోవైపు అర్జున్ సర్జా కన్నడతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అక్క ఐశ్వర్య సినీ రంగాన్ని ఎంచుకోగా.. అంజనాకు మాత్రం సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదు. వ్యాపార రంగంలో రాణించాలన్నది ఆమె లక్ష్యం. ఈ క్రమంలో 2023లో హ్యాండ్‌బ్యాగుల తయారీ సంస్థను స్టార్ట్ చేసింది. పర్యావరణహితంగా ఉండేలా పండ్లు, కూరగాయల తొక్కలు, నార వంటి సహజ పదార్థాలతో హ్యాండ్‌బ్యాగులను తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు. ప్రస్తుతం తన వ్యాపారాన్ని కొనసాగిస్తూనే అంజనా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. దీంతో అర్జున్ సర్జా కుటుంబంలో వివాహ వేడుకల సందడి మొదలుకానుంది.

Exit mobile version