
Athadu Re-Release : సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘అతడు’ మళ్లీ బిగ్ స్క్రీన్‌పై సందడి చేయబోతోంది. 2005లో విడుదలై బుల్లితెరపై రికార్డు స్థాయిలో ప్రసారమైన ఈ సినిమా, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 2025 ఆగస్ట్ 9న రీ-రిలీజ్ కాబోతోంది. జయభేరి ఆర్ట్స్ పతాకంపై మురళీ మోహన్ నిర్మించిన ఈ చిత్రం టెక్నాలజీ పరంగా అప్‌గ్రేడ్ చేయబడి, అధునాతన విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మురళీ మోహన్ మాట్లాడుతూ, “అతడు చిత్రం మాకు గర్వకారణం. మా బ్యానర్‌లో 2005 ఆగస్ట్ 10న అతడు సినిమాను రిలీజ్ చేశాం. ఇప్పుడు ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నాం. నా సోదరుడు కిషోర్ తనయ ప్రియాంక ఈ మూవీని టెక్నికల్‌గా అప్ గ్రేడ్ చేసి అందరి ముందుకు తీసుకు వస్తున్నారు. ఇక ముందు ప్రియాంక ఆధ్వర్యంలో జయ భేరి ఆర్ట్స్ నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. రీ రిలీజ్ కోసం గత కొన్నేళ్ల నుంచి అందరూ నన్ను సంప్రదిస్తూ ఉన్నారు. జితేంద్ర వచ్చి అడిగిన తరువాత కాదనలేకపోయాను. ‘అతడు’ రీ రిలీజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని కచ్చితంగా నమ్ముతున్నాను. ప్రసాద్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్ మీదకు సినిమాను తీసుకు రావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం.
‘అతడు’ సినిమాలోని ప్రతీ డైలాగ్‌ను జనాలు ఇప్పటికీ వాడుకుంటూనే ఉంటారు. థియేట్రికల్ పరంగా మేం అనుకున్నంత రేంజ్‌లో ఆడలేదు. కానీ బుల్లితెరపై మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ కోసం వేసిన సెట్‌ను ఇతర ప్రొడక్షన్ కంపెనీలు కూడా వాడుకున్నాయి. వాటి ద్వారా కూడా చాలా డబ్బులు వచ్చాయి. కమర్షియల్‌గా ‘అతడు’ పట్ల మేం సంతృప్తిగానే ఉన్నాం. మేం తీసిన అన్ని చిత్రాలు ఒకెత్తు.. ‘అతడు’ ఇంకో ఎత్తు. ఇక అద్భుతమైన డైలాగ్స్‌తో త్రివిక్రమ్ అందరినీ మెప్పించారు. అందుకే త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు అయ్యారు.
అతడు పార్ట్ 2 తీస్తే మళ్ళీ మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లోనే తీస్తాను. మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు డేట్లు ఇస్తే ‘అతడు’ సీక్వెల్‌ను మా బ్యానర్ నిర్మిస్తుంది. సీక్వెల్ కి అవకాశం ఉంది కథలో. అప్పట్లో పార్ట్ 2లు లేవు కాబట్టి అంతటితో ఆగిపోయింది. రీ రిలీజ్ చూసి ఫ్యాన్స్ అంతా కూడా పార్ట్ 2 రావాలని కోరితే డెఫినెట్ గా తీస్తాం అని అన్నారు. ఇక ఇందులో నాజర్ గారు పోషించిన పాత్రకి శోభన్ బాబు గారిని అనుకున్నాం. ఆ పాత్ర కోసం ఆయనకు బ్లాంక్ చెక్‌ను పంపించాం. కానీ శోభన్ బాబు గారు మా ఆఫర్‌ను తిరస్కరించారు. హీరోగానే అందరికీ గుర్తుండాలి కానీ ఇలా ఇంకో పాత్రలో నన్ను గుర్తు పెట్టుకోకూడదు అని ఆయన ఆ పాత్ర రిజెక్ట్ చేశారు. త్రివిక్రమ్ గారు ‘అతడు’ మూవీని చాలా డిఫరెంట్‌గా తీశారు. ఆ టైంలో ఈ మూవీ ఓవర్సీస్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బుల్లితెరపై ఎక్కువ సార్లు ప్రదర్శించిన చిత్రంగా ‘అతడు’ రికార్డులు క్రియేట్ చేసింది” అని అన్నారు.
మహేష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధి అన్వేష్ మాట్లాడుతూ.. ‘అతడు’ సినిమాను మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 9న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఈ రీ రిలీజ్‌ల ద్వారా ఎంత డబ్బు వచ్చినా సరే దాన్ని ఫౌండేషన్ కోసమే వాడుతున్నాం. మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని అన్నారు.
జయభేరి ఆర్ట్స్ ప్రతినిధి ప్రియాంక దుగ్గిరాల మాట్లాడుతూ.. ‘అతడు’ మూవీని ఫిల్మ్‌లో తీశారు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని దాన్ని 8k, సూపర్ 4Kలోకి మార్చాం. డాల్బీ సౌండ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. క్లైమాక్స్ ఫైట్‌లో సౌండింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. మళ్లీ ఈ మూవీని థియేటర్లో చూస్తే పాత రోజులు గుర్తుకు వస్తాయిని అన్నారు.
