Site icon TeluguMirchi.com

Baby Nakshatra: చిన్నారి నక్షత్రకు తండ్రి లేరని అప్పుడే తెలిసింది.. ‘ఇరుముడి’ డైరెక్టర్ చెప్పిన ఎమోషనల్ స్టోరీ!

Emotional Story

Baby Nakshatra: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు శివ నిర్వాణ చిన్నారి నక్షత్రపై ప్రశంసలు కురిపించారు. సినిమా కోసం ఆమె చూపించిన ధైర్యం, అంకితభావం, ఎమోషనల్ సీన్లలో నటన గురించి చెబుతూ.. నక్షత్ర తల్లి, మామయ్యను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నక్షత్ర అనుమతి తీసుకుని ఆమె గురించి తనకు తెలిసిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సినిమాలో ఆడపిల్లలు ధైర్యంగా పెరగాలని, తల్లిదండ్రులు కూడా వారిని అదే విధంగా పెంచాలని చెబుతుంటామని శివ నిర్వాణ అన్నారు. అయితే నక్షత్రలో ఉన్నంత ధైర్యం, గట్టి గుండె ఉన్న చిన్నారిని తాను ఇప్పటివరకు చూడలేదని ప్రశంసించారు. షూటింగ్ ప్రారంభమైన సమయంలో నక్షత్రకు తెలుగు విషయంలో చాలా భయం ఉండేదని తెలిపారు. తాను సరిగ్గా మాట్లాడలేనేమో, తప్పులు వస్తాయేమోనని ఆమె ఆందోళన చెందేదని చెప్పారు.

దీంతో తెలుగు, మలయాళం రెండూ తెలిసిన ఓ అసిస్టెంట్‌ను నక్షత్రతో ఉంచామని శివ తెలిపారు. ఆమెకు ప్రతి విషయాన్ని రెండు భాషల్లో అర్థమయ్యేలా వివరించడంతో.. నక్షత్ర క్రమంగా తెలుగు నేర్చుకుని, డైలాగ్స్‌ను సులభంగా చెప్పడం ప్రారంభించిందన్నారు. అయితే ఓ రోజు కామెడీ సీన్లు, పాటలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ ఎమోషనల్ సీన్ వచ్చిందని దర్శకుడు గుర్తుచేశారు. అది తండ్రికి సంబంధించిన సన్నివేశమని చెప్పారు. ఆ సీన్‌లో నటించేటప్పుడు నక్షత్రకు కొన్ని సూచనలు ఇచ్చి.. “మీ ఫాదర్‌ను ఊహించుకుని చేయి” అని చెప్పానన్నారు. అందుకు నక్షత్ర “నాకు తండ్రి లేరు” అని చెప్పిందని వెల్లడించారు. అప్పటికే నక్షత్ర రెండు, మూడు ఎమోషనల్ సీన్లు చేసిందని శివ తెలిపారు. ఆ విషయం తెలిసిన తర్వాత ఆమెను మరింత బాధపెట్టకూడదని భావించి.. “పర్లేదు.. సిచువేషన్‌ను ఇమాజిన్ చేసి, నీలో ఎంత ఎమోషన్ తీసుకురాగలవో అంత తీసుకురా” అని చెప్పానన్నారు. సినిమా క్లైమాక్స్‌లో నక్షత్ర అద్భుతంగా నటించిందని శివ నిర్వాణ ప్రశంసించారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో వచ్చే సన్నివేశాల్లో ఆమె నటన ఎంతో ఆకట్టుకుందని చెప్పారు. ఎమోషనల్ సీన్లలో నక్షత్ర చూపించిన కన్విక్షన్, పవర్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. “బాగా చేయండి.. మరో టేక్ తీసుకోండి.. డోంట్ కాంప్రమైజ్” అని దర్శకుడిగా తానే చెప్పే స్థాయిలో ఆమె నటించిందని కొనియాడారు. “ఆ కన్విక్షన్, ఆ పవర్‌కు కారణం ఈ పిల్ల. ఆ పిల్లను పెంచిన ఆ పులి ఆమె తల్లి” అంటూ నక్షత్ర తల్లిని కూడా శివ నిర్వాణ ప్రత్యేకంగా ప్రశంసించారు. పాపను నీటిలో తడపకండి, ట్యాంక్‌లో వేయకండి అంటూ ఎలాంటి ప్రత్యేక షరతులు కూడా పెట్టలేదని శివ తెలిపారు. చిన్నారి విషయంలో షూటింగ్ సమయంలో తమకు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదని చెప్పారు. “నిజంగా పెంచడం అంటే ఇదే.. బ్రాట్ అప్ అంటే ఇదే” అంటూ నక్షత్ర తల్లి పెంపకాన్ని ప్రశంసించారు. నక్షత్రను “వండర్ఫుల్ ఆర్టిస్ట్”గా అభివర్ణించిన శివ నిర్వాణ.. ‘ఇరుముడి’ కోసం ఆమె అందించిన సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. నక్షత్రపై తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం సక్సెస్ మీట్‌లో దర్శకుడు చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

Exit mobile version