
Roshan : స్వప్న సినిమాస్ అప్‌కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా, ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ సినిమా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రోషన్ మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ తనను, సినిమాను ప్రశంసించడం చాలా ఆనందంగా అనిపించిందని రోషన్ చెప్పారు. చిన్నప్పటి నుంచే పరిచయం ఉన్న చరణ్ తన టీమ్ గురించి ఎంతో ఆత్మీయంగా మాట్లాడటం మరింత సంతోషాన్నిచ్చిందన్నారు. ‘ఛాంపియన్’ కథ 1948లో జరిగే యాక్షన్ డ్రామా అని, చరిత్రలో ప్రసిద్ధమైన బైరాన్ పల్లి నేపథ్యంతో మైఖేల్ అనే ఫిక్షనల్ క్యారెక్టర్‌ను క్రియేట్ చేసి కథను ప్రజెంట్ చేసినట్లు తెలిపారు. ఈ పాత్ర కోసం హైదరాబాది యాసను ప్రత్యేకంగా నేర్చుకుని, వర్క్‌షాప్స్ ద్వారా మంచి ప్రిపరేషన్ చేశానని చెప్పారు.
ఈ సినిమాకు మూడు సంవత్సరాలు కేటాయించడం పూర్తిగా తన నిర్ణయమేనని రోషన్ స్పష్టం చేశారు. నిజానికి హీరోలందరూ 25 ఏళ్లు ఏజ్ లోనే వస్తారు. నేను 21 ఏళ్లకే వచ్చేసాను. బ్రేక్ లాగా అనిపిస్తుంది కానీ కరెక్ట్ ఏజ్ ఇదే. కం బ్యాక్ ఇవ్వడానికి ఇదే కరెక్ట్ ఏజ్. ఈ గ్యాప్ తీసుకోవడం కూడా కంప్లీట్ గా నా నిర్ణయమే. యాక్టింగ్ అంటే చాలా హ్యూమన్ ఎమోషన్స్ తెలియాలి. దానికి ఒక మెచ్యూరిటీ కావాలి. ఈ మూడేళ్లలో చాలా ట్రావెల్ చేశాను. చాలా నేర్చుకున్నాను. ఈ మూడేళ్లు చాలా హ్యాపీగా జరిగింది.
పీటర్ గారు డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా వచ్చాయని, షూటింగ్ సమయంలో కొన్ని గాయాలు కూడా అయ్యాయని చెప్పారు. అయితే యాక్షన్ సినిమా అంటే ఇవన్నీ సాధారణమేనన్నారు. ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా హైదరాబాద్ కి స్వతంత్రం రాని రోజుల్లో జరిగిన కథ ఇది. మా డైరెక్టర్ గారు అన్ని రిఫరెన్సులు ఇచ్చారు. స్వప్న గారు చాలా పర్టికులర్ గా ఉంటారు. డైరెక్టర్ గారు, స్వప్న గారు, ఆర్ డైరెక్టర్ తోట గారు ప్రతిదీ రీసెర్చ్ చేశారు. ఆ కాలంలో ఎలా ఉండేవారు డైరెక్టర్ గారు ప్రతీది కేర్ తీసుకుని చేశారు. ఈ సినిమా కోసం చాలా వర్క్ షాపులు కూడా చేశాము. ఇందులో అద్భుతమైన డ్రామా ఉంది. ప్రతి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది.
హీరోయిన్ అనస్వర రాజన్ గురించి మాట్లాడుతూ, ఆమె అనుభవం ఈ సినిమాకు చాలా ప్లస్ అయిందని రోషన్ తెలిపారు. హీరో-హీరోయిన్ మధ్య డ్రామా ఫన్‌గా, డెప్త్‌తో ఉంటుందన్నారు. అలాగే ఈ సినిమాలో కనిపించే ప్రతి ఆబ్జెక్ట్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని, వింటేజ్ కార్ కూడా ఒక క్యారెక్టర్‌లా ఉంటుందని చెప్పారు. మిక్కీ జే మేయర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్తుందని తెలిపారు.
‘ఛాంపియన్’ తనలో ఓపికను పెంచిందని, యాక్టర్‌గా కొత్త రోషన్‌ను ప్రేక్షకులు చూస్తారని ఆయన అన్నారు. గ్రామీణ నేపథ్యంలోని హ్యూమన్ ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయని, ఈ సినిమా చూసిన తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకోవడం సరైన నిర్ణయమేనని ప్రేక్షకులే చెబుతారని నమ్మకం వ్యక్తం చేశారు. త్వరలో తన కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని, ఇకపై ఎక్కువ గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేయాలని అనుకుంటున్నానని రోషన్ వెల్లడించారు.
