
Megastar Chiranjeevi: హైదరాబాద్ సినీ ప్రియులకు కనీవినీ ఎరుగని విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి నడుం బిగించారు. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ‘ఏషియన్ సినిమాస్’ సునీల్ నారంగ్‌తో చేతులు కలిపి భాగ్యనగరంలో ఓ అద్భుత ప్రాజెక్ట్‌కు మెగా బాస్ శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. సినిమా చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చూడని స్థాయిలో ఏకంగా ప్రపంచంలోనే అత్యంత భారీ స్క్రీన్‌ను హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతుండడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
ఐటీ, కార్పొరేట్ హబ్‌గా శరవేగంగా విస్తరిస్తున్న నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో ఈ మెగా మల్టీప్లెక్స్ రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్ట్‌లోని ప్రధాన ఆకర్షణ దాదాపు 130 అడుగుల వెడల్పుతో సిద్ధం కానున్న భారీ స్క్రీన్. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌గా గుర్తింపు పొందిన జర్మనీకి చెందిన ‘ట్రాంపాలస్ట్ లియోన్‌బర్గ్’ (127 అడుగులు) రికార్డును సైతం ఇది అధిగమించనుందని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక సాంకేతికతతో ఐమ్యాక్స్ లేదా డాల్బీ సినిమా ఫీచర్లను ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే మహేష్ బాబు (ఏఎంబీ సినిమాస్), అల్లు అర్జున్ (ఏఏఏ సినిమాస్)లతో భాగస్వామ్యమై సంచలనాలు సృష్టించిన ఏషియన్ సంస్థ, ఇప్పుడు మెగాస్టార్‌తో కలిసి ‘ఏఎమ్‌సీ – ఏషియన్ మెగాస్టార్ చిరంజీవి మాల్’ పేరుతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ భారీ మల్టీప్లెక్స్‌కు సంబంధించి అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఇప్పటికే లభించినట్లు సమాచారం.
అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నానక్‌రామ్‌గూడలో రాబోయే ఈ వెంచర్ హైదరాబాద్‌ను గ్లోబల్ సినిమా మ్యాప్‌లో సరికొత్త శిఖరాలకు చేరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ క్రేజ్‌కు తగ్గట్టుగా అంతర్జాతీయ అనుభూతిని అందించబోయే ఈ మెగా స్క్రీన్ కోసం ప్రేక్షకులు ఇప్పటినుంచే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
