
Chiranjeevi: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ముసుగులో మహిళల గౌరవాన్ని నడిరోడ్డుపై నిలబెట్టే దుష్ట సంస్కృతిపై మెగాస్టార్ చిరంజీవి నిప్పులు చెరిగారు. టెక్నాలజీతో తోటి మనుషుల శీలహననం చేయడం అత్యంత అమానుషమని, ఒక మహిళను ఇంత హేయంగా చిత్రీకరించడం తన మనసును తీవ్రంగా కలచివేసిందని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ విష సంస్కృతిపై పోరాడేందుకు టాలీవుడ్ మొత్తం ఏకతాటిపైకి రావాలని చిరు పిలుపునిచ్చారు. ఈ వికృత చేష్టలు కేవలం ఒక నటుడికో లేదా నిర్దిష్ట చిత్రానికో సంబంధించినవి కావని, రేపు సమాజంలో ఎవరికైనా ఎదురయ్యే ముప్పని చిరంజీవి హెచ్చరించారు. ఈ బెడదను ఎదుర్కొనేందుకు ఒక నిర్దిష్ట కార్యాచరణను ఆయన తెరపైకి తెచ్చారు:
తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఇతర సినీ సంఘాలతో సమన్వయం చేసుకుని వెంటనే ఒక ప్రత్యేక విభాగాన్ని (కమిటీని) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా, వివాదాస్పద కంటెంట్‌ను ఇంటర్నెట్ నుంచి పూర్తిగా తొలగించేలా ఈ విభాగం సైబర్ పోలీసులతో కలిసి పనిచేయాలని సూచించారు. వీడియోలు సృష్టించే వారిని మాత్రమే కాకుండా, వాటిని సరదా కోసం షేర్ చేసే ప్రతీ ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టాలని తేల్చిచెప్పారు. “ఇలాంటి నీచమైన కంటెంట్‌ను వినోదంగా చూడకండి.. ఫార్వర్డ్ చేసి తోటి మనుషుల గౌరవాన్ని చంపకండి” అంటూ నెటిజన్లకు చిరు సూటిగా విజ్ఞప్తి చేశారు. కనిపించిన వెంటనే వాటిపై సైబర్ క్రైమ్ అధికారులకు, సామాజిక మాధ్యమ వేదికలకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కఠిన చట్టాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్త్రీల ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యతని, సినీ కుటుంబమంతా ఒక్కటై బాధితులకు కవచంలా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చిరంజీవి పేర్కొన్నారు.
