
Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణ్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘స్పిరిట్’ నుంచి దీపిక తప్పుకోవడం వెనుక కేవలం 8 గంటల వర్క్ అవర్స్ మాత్రమే కారణం కాదనే ప్రచారం జరుగుతోంది. నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తాజాగా చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపిక తప్పుకోవడానికి సంబంధించిన కారణాలపై ఇప్పటికే పలు రకాల వార్తలు వినిపించాయి. తాజాగా నిర్మాత వ్యాఖ్యలతో రెమ్యునరేషన్, లాభాల్లో వాటా వంటి అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. దీపిక సినిమా నికర లాభాల్లో వాటా కోరినట్లు, ముఖ్యంగా 10 శాతం లాభాల వాటా డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలోనే ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తినట్లు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న సినీ అభిమానుల్లో మొదలైంది. ‘స్పిరిట్’ తర్వాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంలో దీపికా పదుకోణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా విషయంలోనూ ఆమె అదే తరహా షరతులు పెట్టారా? లేక ఈ ప్రాజెక్ట్ కోసం తన నిబంధనల్లో కొంతమేర రాజీ పడ్డారా? అనే చర్చ మొదలైంది. ‘స్పిరిట్’ విషయంలో 8 గంటల పని నిబంధనతో పాటు లాభాల్లో వాటా వంటి అంశాలు కీలకంగా మారినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ‘రాకా’ విషయంలో దీపిక ఎలాంటి ఒప్పందంతో ముందుకు వెళ్లారనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు దీపిక, ‘రాకా’ చిత్రబృందం నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.
