
Dhanush Political Entry: తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ధనుష్ అభిమాన సంఘం అధ్యక్షుడు సుబ్రమణియం శివ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ధనుష్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుబ్రమణియం శివ.. ప్రతి ఏడాది హీరో పుట్టినరోజును అభిమానులు జరుపుకుంటారని, అయితే గత ఐదేళ్లుగా భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించలేదని తెలిపారు. అందుకే ఈసారి ధనుష్ పుట్టినరోజును ప్రత్యేకంగా, గ్రాండ్‌గా నిర్వహించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమానికి నిర్మాత ఇషారి గణేష్ సహకారం అందించారని ఆయన వెల్లడించారు. ధనుష్‌తో ఉన్న స్నేహం కారణంగా ఆయన అన్ని విధాలుగా మద్దతు ఇచ్చారని, ఇషారి గణేష్‌కు మెడికల్ కాలేజ్ ఉండటంతో పుట్టినరోజు వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక ధనుష్ పొలికట్ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాల గురించి స్పందించిన సుబ్రమణియం శివ.. “ధనుష్ రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం. సరైన సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటిస్తారు. ఈ విషయంలో మా (అభిమానుల) అభిప్రాయాలు లేదా అంచనాలకు ఎలాంటి ప్రాధాన్యం లేదు” అని స్పష్టం చేశారు. దీంతో ధనుష్ రాజకీయ అరంగేట్రంపై వస్తున్న ప్రచారానికి మరోసారి ఊతం లభించినప్పటికీ, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ప్రస్తుతం ధనుష్ అభిమాన సంఘం అధ్యక్షుడు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
