
Game Changer : నిర్మాత శిరీష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్యూలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల తర్వాత రామ్ చరణ్, శంకర్ తమకు ఫోన్ కూడా చేయలేదంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద దుమారమే లేపాయి. ఈ వ్యాఖ్యలపై చరణ్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు దీనిపై వివరణ ఇచ్చారు.
గత పది రోజులుగా ‘గేమ్ ఛేంజర్’ లేకుండా ఏ ఇంటర్వ్యూ జరగడం లేదు. ఈ ప్రాజెక్ట్‌లో రామ్ చరణ్ మరియు దర్శకుడు శంకర్‌తో కలిసి పనిచేశానని, అయితే శిరీష్ ఈ సినిమా పనుల్లో ఎక్కువగా పాల్గొలేదని వివరించారు. ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఎక్కువగా పని చేసారు. కానీ ఎక్కడా చరణ్‌కి వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టంగా చెప్పారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ మాకు డేట్స్ ఇచ్చారు. శంకర్ ‘ఇండియన్ 2’ చేయాల్సి వచ్చింది. అందువల్ల వేరే సినిమా చేసుకో అని తానే చరణ్‌కి సూచించానని, కానీ చరణ్ మాత్రం ఒకే సినిమాకే కట్టుబడి వున్నారని తెలిపారు. దర్శకుడు శంకర్ గారు పెద్ద దర్శకుడు కావడంతో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోయాం. దాంతో షూటింగ్ షెడ్యూల్స్‌పై స్పష్టత లోపించి ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వచ్చింది. అయినా చరణ్ ఎంతో ఓపికగా సహకరించారు. సాధారణంగా రెండు సినిమాలు ఒకేసారి వస్తున్నాయంటే వద్దని చెబుతారు. కానీ చిరంజీవి గారు, చరణ్ ఓకే అన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మా బ్యానర్ నుండి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మంచి విజయాన్ని అందుకోగా, ‘గేమ్ ఛేంజర్’ సరిగా ఆడలేదు. అందుకే రామ్ చరణ్‌కు మా బ్యానర్ తరఫున ఒక మంచి సక్సెస్ ఇవ్వాలని, ఆయనతో సినిమా చేస్తానని ప్రకటించా.
ఇక శిరీష్‌కు అది మొదటి ఇంటర్వ్యూ అవ్వడంతో, ఎమోషనల్ గా మాట్లాడే క్రమంలో అలా మాట్లాడేశారని, అంతే తప్ప తమకూ రామ్ చరణ్ కు మధ్య ఎటువంటి బేదాభిప్రాయాలు లేవని తెలిపారు. సినిమాలకు సంబంధించి ఆయన డిస్ట్రిబ్యూషన్ కోణంలోనే ఆలోచిస్తారు. ఆ ఉద్దేశంతో మాట్లాడిన మాటలనే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఆయనకు ఇంటర్వ్యూలు ఇచ్చిన అనుభవం ఉంటే బ్యాలెన్స్‌గా మాట్లాడేవారు. ఆ చిన్న క్లిప్ కాకుండా పూర్తి ఇంటర్వ్యూ చూస్తే విషయం అర్థమవుతుంది అని వివరించారు.
