
Karthik Subbaraj: తమిళ స్టార్ హీరోలైన చియాన్ విక్రమ్, ధ్రువ్ విక్రమ్ కలిసి నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా ‘మహాన్’. నిజజీవితంలో తండ్రీకొడుకులైన ఈ హీరోలు వెండితెరపై కూడా తండ్రీకొడుకులుగా నటించిన సినిమాగా ఈ చిత్రానికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్‌ను వెండితెరకు పరిచయం చేసిన ఘనత దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకే దక్కుతుంది. అయితే అసలు ఈ సినిమా ప్రాజెక్ట్ ఎలా లైన్ లోకి వచ్చింది? ఒకే స్క్రీన్‌పైకి ఈ తండ్రీకొడుకులు ఎలా వచ్చారు? అనే ఆసక్తికరమైన విషయాలను తాజాగా కార్తీక్ సుబ్బరాజు ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.
ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న కథను కార్తీక్ సుబ్బరాజు వివరిస్తూ.. “నేను ధనుష్‌తో ‘జగమే తంత్రం’ సినిమా చేస్తున్న సమయంలో, ప్రముఖ నిర్మాత సెవెన్ స్క్రీన్ స్టూడియో లలిత్ కుమార్ సర్ నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. చియాన్ విక్రమ్ సార్ కోసం ఒక కథ ఉంటే రెడీ చేయగలరా? అని ఆయన నన్ను అడిగారు. ఆ తర్వాత నేను విక్రమ్ సార్‌తో మాట్లాడాను. ఆ సమయంలో ఆయన నాతో మాట్లాడుతూ.. తన కుమారుడు ధ్రువ్ నా సినిమాలకు చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పారు” అంటూ ఆనాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.
“నిజానికి ‘జిగర్తాండ’ సినిమా పూర్తయిన తర్వాత నా దగ్గర ఒక చిన్న స్టోరీ ఐడియా ఉండేది. అదే ‘మహాన్’ కథ. నేను విక్రమ్ సార్‌కు ఈ కథ వినిపించినప్పుడు, కేవలం ఒక తండ్రి, కొడుకు మధ్య సాగే ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాగానే దానిని వివరించాను. సరిగ్గా అదే సమయంలో ధ్రువ్ విక్రమ్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు బయటకు వచ్చాయి. అలా ఆ కథకు విక్రమ్, ధ్రువ్ ఇద్దరూ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారనిపించింది. అలా అంతా అనుకున్నట్లు జరిగిపోయి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది” అని కార్తీక్ సుబ్బరాజు వెల్లడించారు. ఒక చిన్న ఐడియాగా మొదలై.. టాలీవుడ్, కోలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాదర్-సన్ డ్రామాగా నిలిచిన ‘మహాన్’ వెనుక ఉన్న ఈ రియల్ స్టోరీ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రేజీ కాంబోను సెట్ చేసినందుకు ఫ్యాన్స్ మరోసారి మేకర్స్‌కు థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
