Site icon TeluguMirchi.com

KJQ Release Date: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తమ్ముడు హీరోగా సినిమా.. గ్రాండ్ రిలీజ్ అప్పుడే!

KJQ

KJQ Release Date: దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్న క్రేజీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఇదే సమయంలో ఆయన తమ్ముడు శశి ఓదెల హీరోగా, యువ నటుడు దీక్షిత్ శెట్టి మరో ప్రధాన పాత్రలో నటించిన ‘KJQ’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఈ సినిమాకు డైరెక్టర్ కేకే దర్శకత్వం వహించారు. సినిమా చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, ఫైనల్ కట్‌ను కూడా లాక్ చేసిన అనంతరం ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తర్వాత ఆయన చికిత్స పొందుతూ మరణించడం చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తన చివరి చిత్రంగా తెరకెక్కిన ‘KJQ’పై సినీ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. డైరెక్టర్ కేకే ఎంతో నమ్మకంతో, అంకితభావంతో తెరకెక్కించిన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఇప్పటికే సినిమా పనులన్నీ పూర్తవడంతో రిలీజ్‌కి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ‘KJQ’సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శశి ఓదెల హీరోగా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కడం, ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో వస్తున్న చిత్రం కావడంతో పాటు, దర్శకుడు కేకే చివరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ‘KJQ’పై సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. రిలీజ్ తర్వాత ఈ చిత్రం ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version