
Sukumar: టాలెంటెడ్ హీరో సత్యదేవ్ – డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’ (Rao Bahadur). సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వీక్షించారు. అనంతరం ఈ చిత్రంపై ఆయన కురిపించిన ప్రశంసలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
సినిమా చూశాక సుకుమార్ మాట్లాడుతూ.. భారతీయ చలనచిత్ర రంగంలోనే ఇదొక సరికొత్త ప్రయోగమని కొనియాడారు. “‘రావు బహదూర్’ అనేది కలలాంటి ఒక అద్భుత లోకాన్ని కళ్ళకు కట్టే చిత్రం. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు ఇలాంటి కథాంశంతో కూడిన విభిన్నమైన సినిమా రాలేదు. ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి గురిచేసే ఒక మాయా ప్రపంచం ఇది” అని ప్రశంసించారు. ఈ సినిమాలో రావు బహదూర్ పాత్రలో సత్యదేవ్ నటనను సుకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. “ఏ నటుడైనా సరే.. ఇలాంటి ఒక పవర్‌ఫుల్ పాత్ర తమకు దక్కలేదా అని కచ్చితంగా అసూయపడతారు. అంతటి అద్భుతమైన క్యారెక్టర్‌ను సత్యదేవ్ పోషించాడు. ఒక ఆర్టిస్ట్‌కు ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి” అని చెప్పుకొచ్చారు.
డైరెక్టర్ వెంకటేష్ మహా ఎనిమిదేళ్ల పాటు శ్రమించి ఈ కథను వెండితెరపై ఆవిష్కరించిన తీరు, ఆయన విజన్ అత్యంత అద్భుతమని సుకుమార్ కొనియాడారు. కథలోని అసలైన ఎమోషన్‌ను మిస్ చేయకుండా ఇంతటి ప్రయోగాత్మక శైలిలో ప్రెజెంట్ చేయడం సామాన్యమైన విషయం కాదన్నారు. కాస్ట్యూమ్స్, వరల్డ్ బిల్డింగ్ నుంచి ప్రతి ఒక్క టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఈ సినిమా కోసం అత్యున్నత ప్రమాణాలతో పనిచేసిందని అభినందించారు. శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, A+S మూవీస్ బ్యానర్లపై చింత గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మైండ్-బెండింగ్ సైకలాజికల్ సస్పెన్స్ డ్రామా జులై 3 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సుకుమార్‌తో పాటు ఇప్పటికే మహేష్ బాబు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
