
Aakasamlo Oka Tara : బహుభాషా నటుడిగా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ తన యూనిక్ కథా ఎంపికలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకున్నారు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ వెర్సటైల్ యాక్టర్ యువ ప్రతిభావంతుడు పవన్ సాధినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’. ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం మరియు రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు మేకర్స్.
జూలై 28న దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్.. ప్రేక్షకుల హృదయాలను తాకేలా భావోద్వేగాలతో నిండి ఉంది. ఈ గ్లింప్స్‌లో సాధారణ జీవిత క్షణాలను ఎంతో సహజశైలీగా చూపించారు. దుల్కర్ పాత్రలో ఓ ప్రశాంతత, ఆత్మవిశ్వాసం ప్రతీ ఫ్రేమ్‌కి ప్రత్యేకతను జోడించింది. జీవీ ప్రకాష్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి విజువల్ విలువలు జోడిస్తున్నాయి. దుల్కర్ నటనకు పవన్ సాధినేని కథా దృక్పథం తోడై ఈ సినిమా ఓ మెమొరబుల్ ఎమోషనల్ జర్నీగా ప్రేక్షకుల ముందుకు రానుందన్న అంచనాలు గ్లింప్స్ తో పెరిగాయి.
