
Imanvi : ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్ర కథానాయిక ఇమాన్వి, తన కుటుంబాన్ని పాకిస్తాన్ మిలిటరీతో అనుసంధానిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుండగా, కొంతమంది ట్రోల్స్ ఆమె తండ్రి పాకిస్తాన్ సైన్యంలో పనిచేసిన వ్యక్తి అని ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇమాన్వి స్పందిస్తూ.. తన తల్లిదండ్రులు చిన్నవయస్సులో అమెరికాకు లీగల్‌గా వలస వెళ్లారని, తాను లాస్ ఏంజిల్స్‌లో జన్మించిన అమెరికా పౌరురాలిని అని స్పష్టం చేశారు. ఈ పుకార్లు పూర్తిగా కల్పితమైనవి, ద్వేషంతో నిండినవిగా పేర్కొన్నారు. పహల్గాం ఘటనపై ఆమె తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, “కళ ద్వారా ప్రేమను, ఐక్యతను పంచడమే నా జీవిత లక్ష్యం” అని వెల్లడించారు.
ఈ వ్యవహారంలో మీడియా మరియు సోషల్ మీడియా వేదికలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తప్పుడు సమాచారం ఆధారంగా బాధ్యతలేని ప్రచారం చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. మూలాలు పరిశీలించకుండా ట్రోల్స్ వేసిన విషయాలను నిజంగా భావించడం బాధాకరం అంటూ ఆమె మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నేను ఒక ప్రౌడ్ ఇండియన్-అమెరికన్. నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడతాను. అమెరికాలో నటన, నృత్యంలో శిక్షణ పొందాను. భారతీయ సినిమాల్లో భాగమవడం తనకు గర్వకారణమని పేర్కొంటూ, తప్పుడు ప్రచారాలు చేయకుండా సినిమాను ఐక్యతకు వేదికగా మలచాలని పేర్కొన్నారు. ఈ ప్రకటనకు సోషల్ మీడియాలో విస్తృత స్పందన లభిస్తోంది. అభిమానులు, సినీ పరిశ్రమ ప్రముఖులు ఆమెకి మద్దతు తెలుపుతూ పోస్ట్‌లు చేస్తున్నారు.
