
Shashank: భారీ తారాగణం, విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ద్వారా టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమవుతున్నారు శశాంక్ ఏలేటి. ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ నిర్మాతగా, మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన శశాంక్.. తన సినీ కల నెరవేరిన వైనాన్ని, ఫహద్ ఫాజిల్‌తో పనిచేసిన అనుభవాన్ని, నిర్మాత కార్తికేయతో ఉన్న బంధాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
తొలి సినిమాతోనే భారతీయ చిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ నటుల్లో ఒకరైన ఫహద్ ఫాజిల్‌ను డైరెక్ట్ చేసే అదృష్టం దక్కడంపై శశాంక్ హర్షం వ్యక్తం చేశారు. “ఒక కొత్త దర్శకుడికి తన మొదటి చిత్రానికే ఫహద్ ఫాజిల్ లాంటి అద్భుతమైన నటుడు లభించడం నిజంగా డ్రీమ్ డెబ్యూ. అంతకంటే గొప్పగా నేను ఏదీ ఆశించలేను. ఆయనతో గడిపిన ప్రతి రోజూ, కలిసి పనిచేసిన ప్రతి క్షణం నా జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రాణం పోసింది” అని శశాంక్ పేర్కొన్నారు. అలాగే సినిమాలో దివ్య పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సారా నటనను కొనియాడుతూ, ఆమెతో పనిచేయడం కూడా ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని చెప్పారు.
వేదికపై చీఫ్ గెస్ట్‌గా హాజరైన గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి శశాంక్ మాట్లాడారు. “నేను సినీ రంగంలోకి వచ్చి దర్శకుడిగా సినిమాలు చేయాలనుకుంటున్నానని మొదటగా ఎవరితో చెప్పానో.. ఆ అతికొద్ది మందిలో తారక్ అన్న ఒకరు. ఈరోజు నా మొదటి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఆయనే ముఖ్య అతిథిగా రావడం మాటల్లో వర్ణించలేనంత ఆనందాన్ని ఇస్తోంది. నా ప్రయాణాన్ని మొదట్నుంచీ చూసి, ఈ రోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు తారక్ అన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని గుర్తుచేసుకున్నారు.
సినిమా పట్టాలెక్కడానికి, తన విజన్‌ను వెండితెరపై ఆవిష్కరించడానికి ప్రాణం పెట్టిన నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయకు శశాంక్ కృతజ్ఞతలు తెలిపారు. “నా కథను పూర్తిగా నమ్మి, బాసటగా నిలిచిన బాబా (రాజమౌళి), రమా పిన్ని, శోభు గారికి, చిన్న గారికి ధన్యవాదాలు. ఇక నా ప్రాణస్నేహితుడు, నా నిర్మాత కార్తికేయ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఈ ప్రయాణంలో మొదటి రోజు నుంచి చివరి వరకు నా వెన్నంటే ఉన్నాడు. వాడు నా పిల్లర్ ఆఫ్ సపోర్ట్ మాత్రమే కాదు.. నా రహస్యాలు పంచుకునే నమ్మకమైన మిత్రుడు, నా సర్వస్వం. వాడి సపోర్ట్ వల్లే ఈ చిత్రం ఇంత అద్భుతంగా రూపుదిద్దుకుంది”* అని శశాంక్ చెప్పుకొచ్చారు.
సంగీత దర్శకుడు కాలభైరవ, ప్రొడక్షన్ డిజైనర్లు మోహన్ సెప్, డీఓపీ బ్రాడ్, కో-రైటర్ హంజా సహా తెరవెనుక కష్టపడిన సాంకేతిక నిపుణులందరికీ ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అందరినీ మెప్పిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు శశాంక్ ఏలేటి వ్యక్తం చేశారు.
shashank-dont-trouble-the-trouble-fahadh-faasil-ss-karthikeya
