
యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న సూపర్‌హిట్ మూవీ ‘హుషారు’కు సీక్వెల్ వచ్చేస్తోంది. 2018లో విడుదలైన ఈ సినిమా యువతను ఆకట్టుకుని మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా దర్శకుడు శ్రీ హర్ష కోనుగంటి ‘హుషారు 2’ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్‌లో మొదటి భాగంలోని ఐదుగురు స్నేహితులు రూపొందించిన కబూమ్ బీరు ట్రక్కుపై కనిపించగా, దాన్ని ఇరువైపులా కొందరు వ్యక్తులు బలంగా లాగుతున్నట్లు చూపించారు. వారికి తాడులా పాము, ట్రక్కు కింద తాబేలు, పక్కనే బంగారు నగలతో కూడిన పెట్టె, వెనుక ఫ్యాక్టరీ కనిపిస్తున్నాయి. ఈ విజువల్స్ దేవతలు, రాక్షసులు కలిసి చేసిన ‘అమృత మథనం’ను గుర్తు చేస్తున్నాయి. అయితే వీటికి సినిమాకు ఉన్న సంబంధం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
‘హుషారు 2’ను రెట్టింపు ఫన్, మ్యాడ్‌నెస్, నాన్‌స్టాప్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఒరిజినల్ ‘హుషారు’కు కథ, దర్శకత్వం అందించిన శ్రీ హర్ష కోనుగంటి మరోసారి మెగాఫోన్ పట్టుకున్నారు. యూత్ కల్చర్, ఆధునిక సంబంధాలు, కామెడీ టైమింగ్‌పై తనదైన శైలితో ఆకట్టుకున్న శ్రీ హర్ష.. ఈ సీక్వెల్‌ను మరింత కొత్తగా, భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. మొదటి భాగంలో ప్రేక్షకులను అలరించిన ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ను కొనసాగిస్తూనే సరికొత్త అంశాలను ఇందులో చూపించనున్నారు.
‘హుషారు 2’ ప్రధాన షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడాది చివర్లో సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంథోని, దినేష్ తేజ్, శశిధర్ కోచర్లకోట, విధి యాదవ్, అభిజ్ఞ ఉతులూరు, భగవాన్ తివారి, జతిన్ గోసామి, రజయ్ రోవన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
