
Irumudi: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్రబృందం మరో కీలక అప్డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ‘హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి’ అంటూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేలా ‘మల్లెపూల పల్లకి’ పాటను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఆగస్టు 16న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ లాంచ్‌తో పాటు ‘ఇరుముడి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ‘ఇరుముడి’ కేవలం ఆధ్యాత్మిక నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా కాదని తెలుస్తోంది. ఇందులో రవితేజ తాగుడికి బానిసైన తండ్రి పాత్రలో కనిపించనున్నారు. తన కుమార్తె కోరిక మేరకు ఆయన అయ్యప్ప దీక్ష తీసుకోవడం, ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులు కథలో కీలకంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఒక గ్రామంలో బాలికలపై జరుగుతున్న దాడులు, హత్యల నేపథ్యంలో ఓ తండ్రిగా రవితేజ చేసే పోరాటం చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. భావోద్వేగాలతో పాటు యాక్షన్ అంశాలకు కూడా సినిమాలో ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. రవితేజ పాత్రలోని విభిన్న కోణాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు శివ నిర్వాణ కథను రూపొందించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ‘మల్లెపూల పల్లకి’ పాటతో మరింత హైప్ తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆగస్టు 16న జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ‘ఇరుముడి’ చిత్రాన్ని ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
