
Jagapathi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిచిన చిత్రం “పెద్ది”. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను విజయవాడలో కనులపండువగా నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో తరలివచ్చిన మెగా అభిమానుల కోలాహలంతో బెంజ్ సర్కిల్ ప్రాంతం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. విజయవాడతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జగపతి బాబు ఎమోషనల్ అయ్యారు. “1962లో ఇదే బెంజ్ సర్కిల్ దగ్గరున్న సరోజిని దేవి హాస్పిటల్లో నేను పుట్టాను. ప్రతి హాలిడే ఇక్కడే ఎంజాయ్ చేశాను. మీతో పెరిగిన వాడిని, మీతో ఉన్న వాడిని, మీతోనే ఉండిపోయేవాడిని. నేను ఇక్కడ పుట్టింది ఎంత వాస్తవమో.. ‘పెద్ది’ అనే సినిమా ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కి, మా లాంటి ఆర్టిస్టులకి, మీ అందరికీ ఒక పెద్ద దిక్కు అవుతుంది అనేది కూడా అంతే నిజం. ఇది వేరే రేంజ్‌కి వెళ్లిపోయే సినిమా” అని ధీమా వ్యక్తం చేశారు.
అందరి ఆకలి తీర్చే సినిమా.. ‘అప్పలసూరి’గా నా బెస్ట్ ఇక్కడే!
ఈ సినిమా అందరికీ ఒక ఊరటనిస్తుందని చెప్తూ.. “ఇది అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకునే టైం. అందరి ఆకలి, దాహం తీర్చే టైం ఇది. నాకు కూడా. ఎందుకంటే నాకు ఒక మంచి పవర్‌ఫుల్ క్యారెక్టర్ వచ్చి ఎనిమిదేళ్లు అయింది. ‘అరవింద సమేత’ (బసిరెడ్డి) తర్వాత మళ్లీ ఆ రేంజ్ క్యారెక్టర్ ఈ ‘పెద్ది’లోనే దక్కింది. ఇందులో నా క్యారెక్టర్ పేరు ‘అప్పలసూరి’. బుచ్చిబాబు నన్ను ఎలా ఊహించాడో నాకు తెలియదు కానీ, నా కెరీర్‌లోనే ఇదే నా బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. సినిమా కూడా బెస్ట్ అవుతుంది. ఇక రామ్‌చరణ్ తన అసలైన ‘మెగా పవర్’ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు” అని లీక్ ఇచ్చారు జగపతి బాబు. దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభను వినూత్నంగా కొనియాడారు జగపతి బాబు. “మా బుచ్చిబాబు.. పోర్టబుల్ సైజులో, బటానీ సైజులో ఇంత ఉంటాడు. కానీ తనలో ఎంత బుర్ర ఉందో, ఎంత అన్బీలీవబుల్ టాలెంట్ ఉందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. తను చాలా ప్రేమగా ఉంటాడు. ఈ ‘పోర్టబుల్ సెట్’ని ఎక్కడికైనా తీసుకెళ్లి ప్రతి ఇంట్లో, ప్రతి గుండెల్లో చేర్చేస్తాడు. తను ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అద్భుతం. మీరు స్క్రీన్ మీద చూస్తారు, నేను ఎక్కువ చెప్పక్కర్లేదు” అన్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి మాట్లాడుతూ.. “జాన్విని మీలాగే నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడే లైవ్‌లో కలిశాను. సినిమా చేశాం కానీ సెట్స్‌లో కలవలేదు. శ్రీదేవి గారు ఎక్కడున్నా తన కూతురి జర్నీని చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జాన్విని మనందరం ట్రైలర్‌లో చూశాం, ఎంత బాగుందో కదా.. ఈ సినిమా జర్నీ నా జీవితంలో ఒక అద్భుతం. ఇది నా బెస్ట్ ఫిలిం” అంటూ జగపతి బాబు తన స్పీచ్‌ను ముగించారు.
