
Jailer 2 Censor Completed: సూపర్‌స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ వద్ద మరోసారి పూనకాలు తెప్పించేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంతో పాటు రన్‌టైమ్ వివరాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి ‘యు/ఎ’ (U/A) సర్టిఫికేట్ జారీ చేసినట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర నిడివి మూడు గంటల లోపే ఉండడం విశేషం. తాజా సమాచారం ప్రకారం.. ‘జైలర్ 2’ మొత్తం రన్‌టైమ్ 165 నిమిషాల 18 సెకన్లు (సుమారు 2 గంటల 45 నిమిషాలు) గా లాక్ అయినట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్‌తో పోల్చితే ఇది కేవలం మూడు నిమిషాలు మాత్రమే తక్కువ. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు సీట్‌ఎడ్జ్ అనుభూతిని ఇవ్వనున్నట్లు టాక్.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈసారి తారాగణం మరింత భారీగా మారింది. ఎస్.జె.సూర్య, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు, మిథున్ చక్రవర్తి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా మొదటి భాగంలో థియేటర్లను షేక్ చేసిన మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ సైతం ఈ సీక్వెల్‌లో కనిపించబోతున్నారనే వార్తలు అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేశాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని స్పష్టమవుతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ అఫీషియల్ రన్‌టైమ్, సెన్సార్ అప్‌డేట్‌తో తలైవా ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టారు.
