
Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ పేరు వినిపిస్తే చాలు.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి మొదలవుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు ‘జైలర్ 2’ విషయంలోనూ అదే జరుగుతోంది. సినిమా థియేటర్లలోకి రాకముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో మామూలు దూకుడు చూపిండం లేదు. ముఖ్యంగా ఓవర్‌సీస్ మార్కెట్‌లో నమోదవుతున్న ప్రీ-సేల్స్ ట్రేడ్ వర్గాల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. రిలీజ్‌కి ముందే మిలియన్ల డాలర్ల మార్కును అందుకోవడం ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరోసారి బయటపెడుతోంది. ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ప్రధాన హైలైట్ ఓవర్‌సీస్ మార్కెట్. అందుబాటులో ఉన్న ట్రేడ్ సమాచారం ప్రకారం.. బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసమయంలోనే విదేశాల్లో ఈ సినిమా ప్రీ-సేల్స్ 1.5 మిలియన్ డాలర్ల మార్కును దాటాయి. ఒక్క అమెరికాలోనే 6.3 లక్షల డాలర్లకు పైగా అడ్వాన్స్ సేల్స్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ స్థాయి స్పందనతో అక్కడ మరిన్ని షోలు అందుబాటులోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం.
టికెట్లు దొరకకపోవడంతో అభిమానులు తమ బుకింగ్ స్క్రీన్‌షాట్లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. మరోవైపు, ప్రేక్షకుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అదనపు హిందీ వెర్షన్ షోలను కూడా జోడించినట్లు ప్రచారం జరుగుతోంది. ఓవర్‌సీస్‌లోనే కాకుండా తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ‘జైలర్ 2’ బుకింగ్స్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చెన్నైలోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో ప్రీమియం ఫార్మాట్ టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయని సమాచారం. వెట్రి, రాఖీ వంటి థియేటర్లలోనూ టికెట్ల కోసం ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 2023లో విడుదలైన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయంతో ఈ సీక్వెల్‌పై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. రజినీకాంత్ స్టైల్, నెల్సన్ దిలీప్‌కుమార్ టేకింగ్, అనిరుధ్ రవిచందర్ సంగీతం మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేస్తాయనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపిస్తున్న జోరు ఆ అంచనాలకు మరింత బలాన్ని ఇస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ ముందే బుకింగ్స్‌లో ఈ రెంజ్‌లో రెస్పాన్స్ కనిపిస్తుండటంతో తొలి రోజు వసూళ్లపై ఆసక్తి పెరిగింది.
