
Jananayagan: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘జన నాయగన్’ చుట్టూ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమానే విజయ్ చివరి చిత్రం అని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా డైరెక్టర్ హెచ్.వినోద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఇది విజయ్ సర్ చివరి సినిమా అని ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. అయితే సీఎంగా మారిన తర్వాత విజయ్ సర్ నుంచి వచ్చే తొలి సినిమాగా మాత్రం దీన్ని చూడొచ్చు” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయ్ భవిష్యత్ సినీ ప్రయాణంపై మరోసారి చర్చ మొదలైంది. అంతేకాదు, ‘జన నాయగన్’ కేవలం ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదని ఆయన స్పష్టం చేశారు. విజయ్‌ను హీరోయిక్‌గా చూపించడానికే ఈ సినిమాను తెరకెక్కించలేదని, సమాజానికి దగ్గరగా ఉండే సున్నితమైన రాజకీయాల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కిందని వెల్లడించారు.
విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన నటిస్తున్న చివరి చిత్రంగా ‘జన నాయగన్’పై భారీ ప్రచారం జరిగింది. అయితే తాజాగా డైరెక్టర్ చేసిన ఈ వ్యాఖ్యలతో.. విజయ్ భవిష్యత్తులో మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం ఉందా? అనే చర్చ అభిమానుల్లో జోరందుకుంది. అయితే విజయ్ తన సినీ కెరీర్ కొనసాగింపుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో దర్శకుడు వినోద్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
