
Janhvi Kapoor: కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న వికృత చేష్టలు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు ఆకతాయిలు ఏఐ ద్వారా రూపొందించిన అసభ్యకర వీడియో నెట్టింట తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనపై మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్రస్థాయిలో మండిపడుతూ.. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి అకృత్యాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని బలంగా గళమెత్తారు. తారక్ స్పందనతో మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఖుష్బూ వంటి అగ్ర తారలు కూడా జాన్వీకపూర్‌కు బాసటగా నిలిచారు. తాజాగా ఈ వ్యవహారంపై జాన్వీ కపూర్ అత్యంత ఘాటుగా, భావోద్వేగంతో స్పందించారు.
సాంకేతికత పేరుతో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న వారిపై జాన్వీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కేవలం ఒక భోగవస్తువులా చిత్రీకరించడానికి, వారి అనుమతి లేకుండా అసభ్య కల్పిత దృశ్యాలను వ్యాప్తి చేయడానికి టెక్నాలజీని వాడుకోవడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. “ఇది కేవలం ప్రైవసీ ఉల్లంఘన మాత్రమే కాదు.. ముమ్మాటికీ ఒక మహిళపై జరిగే లైంగిక దాడితో సమానం. చిత్ర పరిశ్రమలోని దాదాపు ప్రతి మహిళ ఏదో ఒక సందర్భంలో ఈ డిజిటల్ వేధింపులను చవిచూసింది. బయట సమాజంలోనూ ప్రతిరోజూ ఎంతోమంది మహిళలు ఇలాంటి నికృష్ట చేష్టల బారిన పడుతూనే ఉన్నారు. ఒక స్త్రీ శరీరానికి ఇవ్వాల్సిన కనీస గౌరవం, వ్యక్తిగత హక్కులు అనేవి సమాజంలో అత్యంత ప్రాథమిక సూత్రాలుగా ఉండాలి” అని జాన్వీ స్పష్టం చేశారు. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్‌కు, మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ, నటి ఖుష్బూ సుందర్‌లకు జాన్వీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం జాన్వీ పెట్టిన ఈ భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
