
Jr NTR: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఆయన టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త అభిమానులను ఒకింత ఆందోళనకు గురిచేసినా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఎన్టీఆర్ టీం అధికారిక ప్రకటన ప్రకారం.. ఎన్టీఆర్‌కు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డా. జె.మధుసూదన్ రావు, డా.ఆర్.ఏ.పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనను పరీక్షించింది. పరీక్షల అనంతరం పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
అయితే గాయం తీవ్రతపై ఎన్టీఆర్ కార్యాలయం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఎన్టీఆర్ నటిస్తున్న ప్రస్తుత చిత్రాల షూటింగ్ షెడ్యూల్‌పై దీని ప్రభావం పడే అవకాశముందనే చర్చ కూడా సినీ వర్గాల్లో సాగుతోంది. ఇక అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ కార్యాలయం మరోసారి స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన విషయాన్ని అధికారికంగా, తగిన సమయంలో వెల్లడిస్తామని తెలిపింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తున్నారు.
