Site icon TeluguMirchi.com

Kaala Bhairava: “సెప్టెంబర్‌కి, తారక్ అన్నకి ఏదో విడదీయరాని బంధం ఉంది” కాలభైరవ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Kaala Bhairava

Kaala Bhairava: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో సంగీత దర్శకుడు, గాయకుడు కాలభైరవ పాడిన పాటలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాణంలో, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ సమక్షంలో భైరవ మాట్లాడిన మాటలు, సెప్టెంబర్ నెలకు, తారక్‌‌కు మధ్య ఉన్న మ్యాజికల్ కనెక్షన్‌ను విశ్లేషించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

వేదికపైకి రాగానే మైక్ అందుకుని “జై ఎన్టీఆర్.. అది మినిమం ఉండాలి!” అంటూ భైరవ ఇచ్చిన నినాదంతో ప్రాంగణమంతా అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ఈవెంట్‌కు వస్తుంటే దారిలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం గుర్తొచ్చింది. ఈరోజు తేదీ సెప్టెంబర్ 29. సెప్టెంబర్ నెలకు, నాకు, తారక్ అన్నకు ఏదో తెలియని ఒక విడదీయరాని స్పెషల్ కనెక్షన్ ఉంది. ఎనిమిదేళ్ల క్రితం సరిగ్గా సెప్టెంబర్ (2018)లోనే ‘అరవింద సమేత’ కోసం పాడిన ‘పెనివిటి’ (గుండెనే గొంతు సేసి పాడతాంది రార పెనివిటి) పాట వచ్చింది. ఆ తర్వాత సరిగ్గా రెండేళ్ల క్రితం సెప్టెంబర్‌లోనే ‘దేవర’లోని ‘ఆయుధ పూజ’ (హైలా హైలా ఈరోజు ఆయుధ పూజ చేయాలా) పాట విడుదలైంది. మళ్లీ ఇప్పుడు 2026 సెప్టెంబర్‌లో తారక్ అన్న సమక్షంలో ఈ సినిమా వేడుక జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది” అంటూ తన కెరీర్ మైలురాళ్లను గుర్తుచేసుకున్నారు.

సెప్టెంబర్ సెంటిమెంట్‌ను మరింత లోతుగా వివరిస్తూ.. 2001 సెప్టెంబర్ 27నే తారక్ అన్న కెరీర్‌ను మలుపుతిప్పిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ ప్రయాణం కూడా మొదలైందని గుర్తుచేశారు. ఆయా పాటలకు, సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఏ స్థాయిలో అద్భుతమైన ఆదరణ దక్కిందో.. ఇప్పుడు తాము చేసిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందన్న బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వేదికపై ఉన్న ఈ ఎనర్జీ, వైబ్‌ను అక్టోబర్ 2న థియేటర్లలోకి కూడా తీసుకెళ్లబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

“అక్టోబర్ 2న సినిమా రిలీజ్ అయ్యాక సంగీతానికి ఎలాంటి ప్రశంసలు దక్కినా ఆ క్రెడిట్ అంతా నా మ్యూజిక్ టీమ్‌కే చెందుతుంది. హర్షవర్ధన్, విశాల్ భరద్వాజ్, సిద్ధార్థ్, సాలూర్ బాలు, అరుల్ దేవ్, లిరిసిస్ట్ ఆదిత్య అయ్యంగార్, శ్రీహర్ష యమని.. ఇలా అందరం కలసి ప్రాణం పెట్టి పనిచేశాం. సినిమా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ జోష్ అక్టోబర్ 2 దాకా ఇలాగే కొనసాగాలి. ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా థియేటర్లలో సినిమా చూసి ఆశీర్వదించండి” అని కాలభైరవ పిలుపునిచ్చారు.

Exit mobile version