
King 100: అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా తెరకెక్కుతున్న ‘కింగ్ 100’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నాగార్జున 100వ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ (OST)ను మేకర్స్ తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేశారు. గ్లింప్స్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడంతో.. ఇప్పుడు OST కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నాగార్జునను ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నారనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. ‘కింగ్ 100’ చిత్రానికి రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆర్థిక అసమానతలు, ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటం నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
నాగార్జున కెరీర్‌లో 100వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ‘కింగ్ 100’పై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కంటెంట్‌తో పాటు యాక్షన్, ఎమోషన్, మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. 100వ సినిమా కావడంతో నాగార్జున ఈ ప్రాజెక్ట్‌ను ఎంత ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు? రా కార్తీక్ ఎలాంటి కథ, టేకింగ్‌తో ప్రేక్షకులను మెప్పించబోతున్నారు? అనేది సినిమా విడుదల వరకు ఆసక్తిని రేకెత్తించనుంది.
