Site icon TeluguMirchi.com

Korean Kanakaraju: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కి సూపర్ స్టార్ట్.. తొలి రోజే ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధించిందంటే!

Korean Kanakaraju Day

Korean Kanakaraju

Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు తొలిరోజు నుంచే ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. తాజాగా చిత్రబృందం ప్రకటించిన బాక్సాఫీస్ గణాంకాల ప్రకారం.. ‘కొరియన్ కనకరాజు’ ప్రీమియర్స్‌తో పాటు తొలి రోజు వసూళ్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.10.20 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో వరుణ్ తేజ్ కెరీర్‌లో ఈ చిత్రం మంచి ఓపెనింగ్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

విడుదలకు ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్‌తో పాటు వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ చేసిన ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఓపెనింగ్ డేలో మంచి స్పందన దక్కింది. కథ విషయానికొస్తే.. అనంతపురం జిల్లా పెనుగొండలో చెక్కభజన బృందాన్ని నడిపించే కనకరాజు పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. తన స్నేహితుడు కిష్టప్ప (సత్య)తో కలిసి సరదాగా జీవించే కనకరాజు.. చైత్ర (రితిక నాయక్)ను చూసి ప్రేమలో పడతాడు. ఎప్పటికైనా కొరియా వెళ్లి అక్కడ స్థిరపడాలనేది చైత్ర కల. అయితే అనూహ్యంగా కనకరాజులోకి ఓ కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అతని జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు ఏంటి? ఆత్మ కారణంగా కనకరాజు కొరియా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు ఆ ఆత్మ అతడిని వదిలిందా? అనేది సినిమాలో చూడాల్సిందే. మొదటి రోజే మంచి వసూళ్లు సాధించిన ‘కొరియన్ కనకరాజు’.. రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.

Exit mobile version