
Kriti Sanon : బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ హీరోయిన్లను చాలా తేలికగా తీసుకుంటారని, సెట్స్‌లో వారిని తక్కువ చేసి చూసే ధోరణి ఇంకా కొనసాగుతోందని స్టార్ హీరోయిన్ కృతి సనన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో కృతి .. తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, ఇండస్ట్రీలో ఉన్న డబుల్ స్టాండర్డ్స్‌ను ధైర్యంగా బయటపెట్టారు. ప్రశ్నల దగ్గరే వివక్ష మొదలవుతుంది వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సినిమాలోని సీన్స్ లేదా క్యారెక్టర్ గురించి హీరోయిన్లు ఏవైనా ప్రశ్నలు అడిగితే సెట్స్‌లో చూసే కోణమే వేరుగా ఉంటుందని పేర్కొన్నారు. “ఒక ఫీమేల్ యాక్టర్ ప్రశ్నలు అడిగితే.. ‘అబ్బా.. ఈమె ఎన్ని ప్రశ్నలు అడుగుతుంది, మళ్లీ 50 ప్రశ్నలు మొదలుపెడుతుంది’ అన్నట్లుగా గుసగుసలు వినపడతాయి.
ఇది నా విషయంలో కూడా జరిగింది. నేను ఏవైనా డౌట్స్ అడిగితే.. ‘మరీ అంతగా ఓవర్ అనలైజ్ చేయకు’ అని అనేవాళ్లు. అదే ప్రశ్నను పక్కనున్న మేల్ స్టార్ (హీరో) అడిగితే మాత్రం.. ‘వావ్.. అతను సినిమాలో చాలా ఇన్వాల్వ్ అవుతున్నాడు.. ఓకే అతను చెప్పింది చేద్దాం’ అంటారు. నేను చెప్పిన పాయింట్‌నే హీరో చెప్తే ఒప్పుకుంటారు” అని కృతి సనన్ ఆవేదన వ్యక్తం చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్లకు హీరోలంటేనే భయం. కేవలం లగ్జరీ వసతుల కోసమే తాను ఈ విషయాలు మాట్లాడటం లేదని, ఇక్కడ సమస్య ఆత్మగౌరవానిదని ఆమె స్పష్టం చేశారు. “చాలా సార్లు హీరోలకు ఇచ్చే కార్లు, రూములు పెద్దవిగా ఉంటాయి. హీరోయిన్లకు చిన్నవి ఇస్తారు. నాకు చిన్న రూమ్ ఇచ్చినా, చిన్న కార్ ఇచ్చినా నేను అస్సలు పట్టించుకోను. కానీ, దాని ద్వారా నన్ను తక్కువ చేసి చూడకండి. ఈ వివక్ష చిన్న విషయాల్లోనే స్పష్టంగా కనిపిస్తుంది” అని కృతి అన్నారు. అంతేకాకుండా, సెట్స్‌లో ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ల ప్రవర్తనను కూడా ఆమె తప్పుబట్టారు. “అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా షూటింగ్ స్పాట్‌కి మొదట అమ్మాయిలనే పిలిచే అలవాటు ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు హీరోల టైమింగ్స్ అంటే కాస్త భయం ఉంటుంది. హీరోలు ఇంకా రెడీ కాకపోయినా పర్లేదు కానీ, హీరోయిన్లను మాత్రం ముందే పిలిచి కూర్చోబెడతారు. ఫీమేల్ యాక్టర్స్ టైమింగ్‌ను వాళ్లు చాలా తేలికగా తీసుకుంటారు” అని కృతి సనన్ కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం కృతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
