
KVN Narayana: తమిళ స్టార్ హీరో విజయ్, స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లియో’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందే వీరిద్దరి కాంబోలో మరో ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసినట్లు ప్రముఖ నిర్మాత కేవీఎన్ సంస్థ అధినేత వెంకట్ కే.నారాయణ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ విడుదలైన తర్వాత లోకేష్ కనగరాజ్–విజయ్ కాంబినేషన్‌లో ఓ కంప్లీట్ కొత్త కథతో సినిమా చేయాలని తాము ప్లాన్ చేశామని తెలిపారు. అయితే అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని, అనంతరం అదే కాంబినేషన్‌లో ‘లియో’ తెరకెక్కిందని చెప్పారు.
అలాగే ‘లియో’ తర్వాత విజయ్ నటించిన ‘ది గోట్’ ఆయన చివరి సినిమా అవుతుందనే ప్రచారం కూడా బలంగా జరిగిందని ఆయన గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత విజయ్ మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారని, అలా ‘జన నాయకగన్’ ప్రాజెక్ట్ ప్రారంభమైందని వెల్లడించారు. ఈ సందర్భంగా ‘జన నాయకగన్’ సినిమా గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పారు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’ చిత్రంలోని కొన్ని ఎలిమెంట్స్ విజయ్‌కు బాగా నచ్చాయని, అలాంటి భావోద్వేగాలతో కూడిన అంశాలు తన నెక్ట్స్ చిత్రంలో ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో దర్శకుడు హెచ్. వినోద్ పేరును కూడా విజయ్ స్వయంగా సూచించారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
