
Legacy: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘ది లెగసీ బిగిన్స్’ అంటూ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘పిండం’ ఫేమ్ సాయికిరణ్ రెడ్డి దైదా దర్శకత్వంలో ‘లెగసీ’ తెరకెక్కుతోంది. ఆయన దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. తన తొలి సినిమాతో విభిన్నమైన కథను ఎంచుకున్న సాయికిరణ్.. ఈసారి పొలిటికల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో మరింత ఇంటెన్స్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఇప్పటివరకు చూడని పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించనున్నారని మేకర్స్ చెబుతున్నారు. తండ్రి నుంచి సంక్రమించిన వారసత్వం ఓ యువకుడి జీవితాన్ని ఎలా మలుపుతిప్పింది? ఆ లెగసీ కారణంగా అతడు రాజకీయ, నేర ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టాడు? అనే అంశాల చుట్టూ ఈ సినిమా కథ సాగనున్నట్లు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ నటుడు కే కే మీనన్ ‘లెగసీ’లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏక్తా రాథోడ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రావు రమేష్, మురళీ మోహన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తంగా పవర్‌ఫుల్ అవతార్‌లో విశ్వక్ సేన్, పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో సాగే కథతో ‘లెగసీ’పై మంచి హైప్ ఏర్పడుతోంది. డిసెంబర్ 4, 2026న ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్‌లను సృష్టిస్తోందో చూడాలి.
