Site icon TeluguMirchi.com

Sunil Kumar Reddy: ‘ఎల్‌జీబీటీ’ సక్సెస్‌తో జోష్‌లో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి.. 2027లో సీక్వెల్‌కు సన్నాహాలు!

Sunil Kumar Reddy

Sunil Kumar Reddy: సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకుని సినిమాలు రూపొందించే దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన ‘ఎల్ జి బీ టీ – ఏ లీగల్ బ్యాటిల్’ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల జీవితాల నేపథ్యంలో రూపొందిన ఈ కోర్ట్‌రూమ్ డ్రామా ఇటీవల దేశవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన అందుకుంది. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ చిత్రబృందాన్ని అభినందిస్తూ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ప్రత్యేకంగా ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి, నటుడు ఎల్.బి. శ్రీరామ్ సహా చిత్రబృంద సభ్యులను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ప్రతినిధులు పాల్గొని సినిమా సామాజిక ప్రాధాన్యాన్ని కొనియాడారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావు మాట్లాడుతూ.. ఆత్మగౌరవం కోసం పోరాడే ట్రాన్స్‌జెండర్‌ల జీవితాన్ని ఈ చిత్రం హృదయానికి హత్తుకునేలా చూపించిందని ప్రశంసించారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. అనంతరం సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ఈ సినిమా ఒకే థియేటర్‌లో 30 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితమవడం గొప్ప విషయమని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని కోరుకున్నారు. దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డిపై ఎల్.బి. శ్రీరామ్ ప్రశంసలు కురిపించారు. “ఇంత గొప్ప దర్శకుడిని ఇండస్ట్రీ ఇప్పటివరకు ఎందుకు గుర్తించలేదో ఆశ్చర్యంగా ఉంది. సమాజానికి అవసరమైన కథలను నిజాయితీగా తెరకెక్కించే దర్శకుడు ఆయన. ట్రాన్స్‌జెండర్‌ల జీవితాలను ఇంత లోతుగా చూపించిన తెలుగు సినిమా రావడం చరిత్రాత్మకం” అని అన్నారు. ఈ చిత్రం సమాజంలో ట్రాన్స్‌జెండర్‌లపై ఉన్న అపోహలను తొలగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ప్రతినిధులు కూడా ఈ సినిమా తమ జీవితాలను ఎంతో వాస్తవికంగా ఆవిష్కరించిందని పేర్కొన్నారు. సమాజంలో తాము ఎదుర్కొనే వివక్ష, కుటుంబ సమస్యలు, విద్య, ఉపాధి, న్యాయపరమైన ఇబ్బందులను సినిమా నిజాయితీగా చూపించిందని చెప్పారు. ఈ చిత్రాన్ని పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శిస్తే యువతలో అవగాహన పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఈ చిత్రానికి అందించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. పలు విశ్వవిద్యాలయాల్లో ఈ సినిమాను ప్రత్యేక ప్రదర్శనల కోసం ఆహ్వానిస్తున్నారని వెల్లడించారు. అలాగే ‘ఎల్ జి బీ టీ – ఏ లీగల్ బ్యాటిల్’ చిత్రానికి కొనసాగింపుగా 2027లో సెకండ్ పార్ట్‌ను తెరకెక్కించేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించామని ప్రకటించారు. మరింత బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తామని ఆయన వెల్లడించడంతో ఈ ప్రకటన ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

Exit mobile version