Site icon TeluguMirchi.com

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పిటిషన్‌పై హైకోర్టు కీలక కామెంట్స్.. ఫొటోలపై పూర్తి నిషేధం కుదరదు!

Meenakshi Chaudhary

Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరి వ్యక్తిత్వ హక్కుల (పర్సనాలిటీ రైట్స్) పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో తన ఫర్మిషన్ లేకుండా ఫొటోలు వాడటంపై సర్వహక్కుల నిషేధాజ్ఞ (బ్లాంకెట్ ఇంజంక్షన్) విధించాలన్న ఆమె విజ్ఞప్తికి కోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఎవరి ఫొటోలనైనా పూర్తిగా ఎక్కడా వాడకుండా ఒకేసారి గుత్తగుత్తగా నిషేధాజ్ఞలు ఇవ్వడం సాధ్యం కాదని న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది.

ఇటీవల సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ వివాదాలు ఊపందుకుంటున్న వేళ, మీనాక్షి చౌదరి కూడా తన ఫొటోలు, పేరును ఎవరూ ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. నటిపై ఉన్న అభ్యంతరకర, అశ్లీల కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఊరటనిచ్చింది. అయితే, కేవలం ఫొటోలు వాడటాన్ని మాత్రమే కారణంగా చూపి మొత్తం కంటెంట్‌పై సంపూర్ణ నిషేధం విధించలేమని తేల్చి చెప్పింది.

ధర్మాసనం ఈ సందర్భంగా హీరోయిన్ తరఫు న్యాయవాదిపై ప్రశ్నల వర్షం కురిపించింది. మీనాక్షి పేరు, ఫొటోలను అడ్డం పెట్టుకుని ఇతరులు వ్యాపార లాభాలు ఎలా గడిస్తున్నారో ఆధారాలతో నిరూపించారా?, ఒకరి ఇమేజ్‌ను వాణిజ్య ప్రయోజనాలకు వాడుకుని అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారనే స్పష్టమైన ఆధారాలు ఉంటేనే పర్సనాలిటీ రైట్స్ కింద పూర్తిస్థాయి రక్షణ లభిస్తుంది. ప్రాథమిక దశలోనే అన్ని రకాల కంటెంట్‌పై ఒకే ఆర్డర్‌తో పూర్తి నిషేధం (బ్లాంకెట్ ఇంజంక్షన్) జారీ చేయడం చట్టపరంగా ఆమోదయోగ్యం కాదు.

అసభ్యకరమైన పోస్టులపై చర్యలకు ఆదేశించిన న్యాయస్థానం, వాణిజ్య దుర్వినియోగం అంశంపై బలమైన సాక్ష్యాధారాలు సమర్పించాల్సిందిగా పిటిషనర్ వర్గానికి స్పష్టం చేసింది. తదుపరి వాదనల నిమిత్తం ఈ కేసు విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ తీర్పు సెలబ్రిటీల ఇమేజ్ రైట్స్ పరిధిపై సరికొత్త చర్చకు దారితీస్తోంది.

Exit mobile version