Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని అభిమానులు భారీగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా చిరు సినిమాలపై వరుస అప్‌డేట్స్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం మరింత రెట్టింపైంది. ముఖ్యంగా, విశ్వంభర తర్వాత అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రానికి “మన శంకరవరప్రసాద్ గారు” అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి చిరంజీవి గురించి తన భావాలను పంచుకున్నారు. “చిరంజీవి గారి సినిమాల్లో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు నాకు చాలా ఇష్టమైనవి. రీ-ఎంట్రీ తర్వాత చిరంజీవి స్వాగ్‌ను చూపించాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. చివరికి నాకు ఆ అవకాశం రావడం గర్వకారణం” అని చెప్పారు. అభిమానులు మెగాస్టార్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో దానికి మించి ఈ చిత్రం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే వచ్చే సంక్రాంతికి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తానని అనిల్ రావిపూడి అన్నారు.
ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్నారు. భార్యాభర్తల మధ్య సంబంధాలపై ఆధారంగా ఈ కథ నడుస్తుందని, ఇందులో 70% కామెడీ, 30% ఎమోషనల్ డ్రామా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు. చిరంజీవిని ఇప్పటి వరకు చూడని కొత్త లుక్‌లో ప్రజెంట్ చేస్తున్నామని, వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు.

