Site icon TeluguMirchi.com

Sushmita Konidela: మెగా డాటర్‌కి కీలక బాధ్యత.. దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో సుస్మిత!

Sushmita Konidela

Sushmita Konidela: మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, సినీ నిర్మాత సుస్మిత కొణిదెలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యత అప్పగించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 7న ఈ నియామకానికి సంబంధించిన ప్రభుత్వ మెమో విడుదలైంది. ప్రత్యేక ఆహ్వానితురాలిగా సుస్మిత.. ఆలయ ఈవో, ట్రస్ట్ బోర్డుకు అవసరమైన సందర్భాల్లో తన అనుభవం ఆధారంగా సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. అలాగే ఆలయంలో జరిగే ప్రధాన పండుగలు, ఉత్సవాలు, ఇతర ముఖ్య కార్యక్రమాల నిర్వహణలో సహకరించాల్సి ఉంటుంది. భక్తులకు అందుతున్న సౌకర్యాల మెరుగుదల, ఆలయ కార్యకలాపాలకు సంబంధించి కూడా ఆమె తన వంతు సహకారం అందించే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో సుస్మిత కొణిదెల తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనను ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నామినేట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ దైవిక బాధ్యతను ఎంతో వినమ్రతతో స్వీకరిస్తున్నానని సుస్మిత పేర్కొన్నారు. దుర్గమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సేవ చేయడంతో పాటు ఆలయ కార్యకలాపాల్లో తన వంతు పాత్ర పోషించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కాగా, సుస్మిత కొణిదెల సినీ నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. చిరంజీవి కుమార్తెగా మాత్రమే కాకుండా చిత్ర నిర్మాణ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమెకు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక బాధ్యత దక్కడంతో మెగా అభిమానులు, సినీ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version