
Raj Nidimoru: ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌లలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man) ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో శ్రీకాంత్ తివారీగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ చేసిన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సిరీస్‌కు సంబంధించి తాజాగా ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నిజానికి ఈ సిరిస్‌లో ఆయన పాత్రకు ఫస్ట్ ఛాయిస్ మనోజ్ బాజ్‌పాయ్ కాదని, అసలు ఈ కథను మెగాస్టార్ చిరంజీవి కోసం రాసుకున్నామని దర్శకుడు రాజ్ నిడిమోరు (రాజ్ & డీకే) సంచలన విషయాన్ని వెల్లడించారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు కథను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నిజానికి ఈ కథను మేం మొదట వెబ్ సిరీస్ లాగా అనుకోలేదు. ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఫీచర్ ఫిల్మ్‌గా తెరకెక్కించాలని ప్లాన్ చేశాం. అంతేకాదు, ఈ కథ రాసేటప్పుడు మా మైండ్‌లో ఉన్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయనను దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రిప్ట్ రెడీ చేశాం” అని రాజ్ స్పష్టం చేశారు. మెగాస్టార్‌తో సినిమాగా చేయాలని భావించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాలు, స్క్రిప్ట్‌లో జరిగిన మార్పుల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని, ఆ తర్వాత కాలంలో ఈ కథను మరింత డెవలప్ చేసి, వెబ్ సిరీస్ రూపంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.
ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక మెగాస్టార్ చిరంజీవి గారితో ఓకే అయ్యి ఉంటే.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యేవని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌గా, దేశాన్ని రక్షించే సీక్రెట్ ఏజెంట్‌గా చిరు తన మార్క్ యాక్టింగ్, కామెడీ టైమింగ్‌తో ఇండస్ట్రీని షేక్ చేసేవారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెనుక ఉన్న ఈ ‘మెగా’ ట్విస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
