Site icon TeluguMirchi.com

రైతుల మధ్య వినూత్న ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్న “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” సినిమా

Worth home
ఈ రోజుల్లో సినిమా తీయడం ఎంత కష్టమో, దాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేలా ప్రమోట్ చేయడం అంతకంటే పెద్ద సవాలుగా మారింది. భారీ బడ్జెట్‌లతో పెద్ద నిర్మాతలు ప్రమోషన్స్‌ను విస్తృతంగా నిర్వహిస్తుంటే, సందేశాత్మకంగా రూపొందే చిన్న సినిమాలకు ప్రచారం చేయడం అంత సులభం కాదు. అయితే “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” సినిమా మాత్రం వినూత్నమైన ప్రమోషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రైతులకు ఉపయోగపడే అంశాన్ని కథగా తీసుకున్న ఈ చిత్రం, తన ప్రచార కార్యక్రమాలను కూడా రైతుల మధ్య నుంచే ప్రారంభించడం ప్రత్యేకతగా నిలిచింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రాజేందర్ రెడ్డి రైతుబడి అగ్రి షోలో చిత్రబృందం ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేసి, రైతులకు సినిమా కాన్సెప్ట్‌ను వివరించడం విశేషంగా నిలిచింది.

అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)లో జరిగిన మెగా రైతు మేళాలో కూడా “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” సినిమా టీమ్ స్టాల్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, అధికారులు, స్కాలర్లు, మహిళా యాక్టివిస్టులు మరియు రైతులు మూవీ స్టాల్‌ను సందర్శించి చిత్రబృందాన్ని అభినందించారు. ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫార్మింగ్ వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్ వంటి ఆధునిక సాంకేతికతలను సంప్రదాయ వ్యవసాయ జ్ఞానంతో కలిపి భవిష్యత్తులో వ్యవసాయం ఎలా అభివృద్ధి చెందవచ్చో ఈ చిత్రంలో చూపించినట్లు చిత్రబృందం చెబుతోంది.

సామాజిక అంశాలను ప్రస్తావించినప్పటికీ ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా రూపొందిందని చిత్రబృందం తెలిపింది. వ్యవసాయంతో పాటు ఆధునిక సమాజంలో పెరుగుతున్న విడాకుల సమస్యను కూడా కథలో భాగంగా చూపించారు. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా, శివాజీ రాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుధర్షన్, సీవీఎల్ నరసింహరావు, గుండు సుధర్షన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని CH.V.N.S బాబ్జి సమర్పిస్తుండగా, లోటస్ క్రియేటివ్ వర్క్స్ నిర్మిస్తోంది. మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అరవింద్ మండ్యం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి ఆసక్తిని రేకెత్తించగా, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version