
Nagarjuna: కింగ్ అక్కినేని నాగార్జున 101వ సినిమా గురించి టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు డైరెక్టర్ ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించే అవకాశముందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ కాంబినేషన్‌పై చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో అక్కినేని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’, ‘ఆరెంజ్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భాస్కర్, ఇటీవల తెరకెక్కించిన ‘జాక్’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
అయినప్పటికీ కుటుంబ కథలు, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే కథలను తెరకెక్కించడంలో ఆయనకు ఉన్న ప్రత్యేక శైలి కారణంగా ఇండస్ట్రీలో ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది. అందుకే ఆయనతో నాగార్జున సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో బొమ్మరిల్లు భాస్కర్ నాగార్జున కోసం ఓ బలమైన కథను రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నాగార్జున తన 100వ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత 101వ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ కాంబినేషన్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. నాగార్జున, భాస్కర్ కాంబినేషన్ నిజమైతే ప్రేక్షకులకు ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ దొరికే అవకాశం ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
