
Nani: న్యాచురల్ స్టార్ నాని, యంగ్ టాలెంటడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.88 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, నాని సినీ కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని ఆల్‌టైమ్ రికార్డును సాధించింది. అయితే కలెక్షన్ల వర్షం కురుస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో వినిపిస్తున్న మిక్సిడ్ టాక్, నెటిజన్ల ట్రోల్స్‌పై నాని ఎవరూ ఊహించని రీతిలో చాలా హుందాగా స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పుడు విమర్శలను పట్టించుకోని హీరోలకు భిన్నంగా.. నాని నెట్టింట వస్తున్న ట్రోల్స్, విమర్శకుల రివ్యూలను ఓపెన్‌గా స్వాగతించారు.
‘‘ది ప్యారడైజ్ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ను గమనిస్తున్నా. సినిమాపై మీరు చూపిస్తున్న విపరీతమైన ప్రేమతో పాటు, నెట్టింట వస్తున్న సరదా ట్రోల్స్‌ను కూడా మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను’’ అంటూ ఎక్స్ వేదికగా నాని రాసుకొచ్చారు. అంతేకాకుండా, రివ్యూవర్లు ప్రస్తావించిన అంశాలపై మాట్లాడుతూ.. ‘‘సినిమా చూసి ప్రేక్షకులు, క్రిటిక్స్ ఎత్తిచూపిన లోటుపాట్లను, పొరపాట్లను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాను. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచాలనే ఏకైక లక్ష్యంతో రక్తం, చెమట ధారపోసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమాను మెచ్చుకున్నా, లోపాలను ఎత్తిచూపుతూ విమర్శించినా.. ప్రేక్షకులు చూపించిన ఉత్సాహం నన్ను ఎంతగానో తాకింది. మీ ప్రేమాభిమానాలకు చేతులెత్తి మొక్కుతున్నా’’ అని భావోద్వేగంగా రాసుకొచ్చారు.
కయాదు లోహర్ హీరోయిన్‌గా, సీనియర్ నటుడు మోహన్‌బాబు పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే మరోవైపు నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తోంది. కలెక్షన్ల రికార్డుల వేళ కూడా విమర్శలను గౌరవిస్తూ నాని పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
