
NBK111: నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘NBK111’. తాజాగా ఈ చిత్రం విడుదలపై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ముందుగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించినప్పటికీ, ప్రస్తుతం ఆ అవకాశాలు దాదాపు కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల బాలకృష్ణకు గాయం కావడంతో ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. వైద్యులు దాదాపు మూడు నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తిగా మారిపోయిందని తెలుస్తోంది. ఇప్పటికే ప్లాన్ చేసిన చిత్రీకరణ వాయిదా పడటంతో, మిగిలిన షూటింగ్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ‘NBK111’ ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ కావడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ సినిమా విడుదల వచ్చే ఏడాదికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని సమాచారం. అయితే చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం బయటికి రాలేదు. బాలయ్య పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి, భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ‘NBK111’ విడుదల తేదీపై స్పష్టత రావాలంటే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
