
Parvathy Thiruvothu: చిత్ర పరిశ్రమలో అన్యాయాలపై నోరెత్తితే ఎంతటి స్టార్లకైనా అవకాశాలు గల్లంతవుతాయనే కఠిన వాస్తవాన్ని మరోసారి బయటపెట్టారు ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువోతు. సుమారు రెండు దశాబ్దాలుగా విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ హీరోయిన్.. సినిమా ఇండస్ట్రీలో తనపై జరుగుతున్న అంతర్గత కుట్రలపై బాంబు పేల్చారు. నిజాలు నిర్భయంగా మాట్లాడినందుకే తనను ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారంటూ ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం సౌత్ సినీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సమాజంలోగానీ, సినీ రంగంలోగానీ ఏ చిన్న అన్యాయం జరిగినా ముక్కుసూటిగా స్పందించే నటీమణుల్లో పార్వతి ఒకరు. గతంలో మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA) నుంచి బయటకు వచ్చిన ఆమె.. ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్న నెపోటిజం, మహిళలపై జరిగే అఘాయిత్యాలపై బహిరంగంగా గళమెత్తారు. అయితే ఈ బోల్డ్ యాటిట్యూడే ఆమె కెరీర్‌కు శాపంగా మారినట్లు తాజా ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.
“నేను నా అభిప్రాయాలను ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటమే కొందరికి నచ్చడం లేదు. దాంతో కావాలనే నాకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తున్నారు. ఇండస్ట్రీలో నన్ను పూర్తిగా తొక్కేయాలని చూస్తున్నారు” అని పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ పెద్దలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తనను ప్రేక్షకులు మాత్రం గుండెల్లో పెట్టుకున్నారని పార్వతి తెలిపారు. “సినిమా వాళ్లు నన్ను దూరం పెట్టాలని చూసిన ప్రతిసారీ మలయాళ ప్రేక్షకులు నన్ను మరింతగా ఆదరించారు. వాళ్లు నాపై చూపిస్తున్న ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది, పవిత్రమైనది. ఆ అభిమానమే నన్ను ఈ రోజుకీ నిలబెట్టింది, ఇంకా సినీ రంగంలో పోరాడే ధైర్యాన్ని ఇస్తోంది” అని ఆమె స్పష్టం చేశారు. టాలెంట్ ఉన్న నటీమణుల పట్ల ఇండస్ట్రీలోని కొందరు పెద్దల తీరు ఎలా ఉంటుందో పార్వతి వ్యాఖ్యలతో మరోసారి బహిర్గతమైంది.
