
Poorna Cutout: సాధారణంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్ల దగ్గర ఆయన నిలువెత్తు కటౌట్లు, క్షీరాభిషేకాలు, పూలదండల సందడే కనిపిస్తుంది. ఆ రేంజ్ క్రేజ్ ముందు పక్కన ఎవరూ పెద్దగా కనిపించరు. కానీ ‘జైలర్ 2’ విడుదల సందర్భంగా కేరళలో ఓ అనూహ్య దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. రజనీ సినిమా విడుదల వేళ, టాలీవుడ్ నటి పూర్ణ (షమ్నా కాసిమ్)కు భారీ సైజు కటౌట్ వెలిసింది. సూపర్ స్టార్ మూవీలో ఆమె కనిపించడమే కాకుండా, థియేటర్ల వద్ద ఇలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకోవడం ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో సెన్సేషన్‌గా మారింది.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చి తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో పూర్ణ పాత్రపై మొదటి నుంచీ పెద్దగా హడావుడి లేకపోయినా.. రిలీజ్ తర్వాత అసలు సీన్ మొదలైంది. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఓ ప్రముఖ థియేటర్ ముందు ‘షమ్నా కాసిమ్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో పూర్ణకు నిలువెత్తు కటౌట్ ఏర్పాటు చేసి ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ క్రేజ్‌కు అసలు కారణం సినిమాలో పూర్ణ చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్. ‘జైలర్ 2’లోని ‘అలా బోలేలో’ అనే పాటలో రజనీకాంత్‌తో కలిసి ఆమె వేసిన స్టెప్పులు థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి. మాస్ అండ్ క్లాసికల్ కలబోతగా సాగే ఈ బీట్‌లో సంప్రదాయ కేరళ చీరకట్టులో పూర్ణ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, గ్రేస్ చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన వీడియో క్లిప్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన పూర్ణ.. ఇప్పుడు ఏకంగా తలైవా పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవడంతో పాటు థియేటర్ల వద్ద కటౌట్లు పెట్టించుకునే స్థాయి క్రేజ్ దక్కించుకోవడం విశేషం.
