
Prabhas: భారతీయ చలనచిత్ర పరిశ్రమ భవిష్యత్తులో సరికొత్త సాంకేతిక విప్లవానికి వేదిక కాబోతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు కేవలం హాలీవుడ్‌కే పరిమితమైన హై-ఎండ్ యానిమేషన్ చిత్రాలపై ఇప్పుడు భారతీయ అగ్ర దర్శకుల కన్ను పడిందని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. రాబోయే రోజుల్లో టాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమా వ్యాప్తంగా పలువురు అగ్ర దర్శకులు భారీ బడ్జెట్ యానిమేషన్ ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు రెడీ అవుతున్నారట.
ఈ సరికొత్త ట్రెండ్‌కు గ్లోబల్ స్టార్ ప్రభాస్ శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి రాబోయే అత్యంత ప్రతిష్టాత్మక యానిమేషన్ చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినపడుతోంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ లేదా అత్యాధునిక 3D యానిమేషన్‌లో ఈ ప్రాజెక్టులు ఉండే అవకాశం ఉందట. ‘బాహుబలి’, ‘కల్కి 2898 AD’ వంటి చిత్రాలతో అడ్వాన్స్‌డ్ విజువల్స్‌ని భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేసిన డార్లింగ్ ఇప్పుడు యానిమేషన్ జోనర్‌లోకి కూడా అడుగుపెడుతుండటం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం చిన్న పిల్లల కోసమే కాకుండా, పెద్దలను సైతం మెప్పించే ఇంటెన్స్ యాక్షన్, పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ స్టోరీలతో ఈ యానిమేషన్ సినిమాలు తెరకెక్కనున్నాయని టాక్. ఇండియన్ స్టార్ హీరోల ఇమేజ్, గ్లోబల్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే, ప్రభాస్ డిజిటల్ అవతార్‌ను వెండితెరపై యానిమేషన్ రూపంలో చూడటం అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. రాబోయే రోజుల్లో ఈ యానిమేషన్ చిత్రాలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాలి.
