Site icon TeluguMirchi.com

Prabhas Spirit: రిలీజ్‌కు ముందే ‘స్పిరిట్’ సరికొత్త రికార్డ్..

Spirit

Prabhas Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘స్పిరిట్’. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొన్న నేపథ్యంలో, తాజాగా చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటివరకు తెరకెక్కిన సినిమాలతో పోలిస్తే ‘స్పిరిట్’ అత్యంత తక్కువ బడ్జెట్‌లో రూపొందుతున్న చిత్రంగా టాక్ వినిపిస్తోంది. భారీ సెట్లు, విదేశీ లొకేషన్లకు దూరంగా ఈ సినిమాను కేవలం 5 నుంచి 6 ప్రధాన లొకేషన్లలోనే చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. దీంతో నిర్మాణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించేలా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా షూటింగ్ మొత్తం అత్యంత క్రమశిక్షణతో సాగేందుకు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్వయంగా సెట్స్‌లో ఉండి ప్రతి అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. షూటింగ్ షెడ్యూల్స్, లాజిస్టిక్స్, ప్రొడక్షన్ పనులు అన్నీ పక్కా ప్లానింగ్‌తో జరుగుతున్నాయని సమాచారం. ఇక యాక్టింగ్ పరంగా కూడా ఈ సినిమా ప్రభాస్‌కు పూర్తిగా భిన్నమైన అనుభవాన్ని ఇవ్వబోతోందని టాక్. గతంలో ఎప్పుడూ చేయని విధంగా లాంగ్ డైలాగ్స్‌ను ఒకే టేక్‌లో చెప్పడంతో పాటు, లెంగ్తీ సీన్స్‌ను సింగిల్ షాట్‌లో పూర్తి చేస్తూ ప్రభాస్ తన పెర్ఫార్మెన్స్‌తో యూనిట్‌ను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా ప్రభాస్‌లోని కొత్త నటుడిని ప్రేక్షకులు చూడబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్, ఇంటెన్స్ డ్రామాతో ‘స్పిరిట్’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version