
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కారణంగా తాను బాలీవుడ్ చిత్రం ‘దాయరా’ను దాదాపుగా వదులుకోవాలని అనుకున్నట్లు పృథ్వీరాజ్ తాజాగా వెల్లడించారు. ‘వారణాసి’లో పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
పృథ్వీరాజ్ నటిస్తున్న ‘దాయరా’కు ప్రముఖ దర్శకురాలు మేఘ్నా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చ సందర్భంగా పృథ్వీరాజ్ తన నిర్ణయం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వారణాసి’ షూటింగ్ షెడ్యూల్స్, తనకున్న ఇతర కమిట్‌మెంట్స్ కారణంగా ‘దాయరా’కు డేట్స్ కేటాయించడం కష్టంగా అనిపించిందని తెలిపారు. దీంతో ఈ సినిమాను వదులుకోవాలనే ఆలోచన కూడా తనకు వచ్చినట్లు చెప్పారు. అయితే మేఘ్నా గుల్జార్ నుంచి మీటింగ్‌కు ఆహ్వానం రావడంతో పరిస్థితి మారిందని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.
“మేఘ్నా గుల్జార్ ఒక మీటింగ్ కోసం అడిగినప్పుడు ఏ నటుడైనా కచ్చితంగా ఆమెను వదులుకుంటారా” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మేఘ్నా గుల్జార్ దర్శకత్వంలో కరీనా కపూర్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో ‘దాయరా’లో భాగం కావాలని నిర్ణయించుకున్నట్లు పృథ్వీరాజ్ తెలిపారు. కాగా, ‘దాయరా’ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. మేఘ్నా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు ‘వారణాసి’లో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా జోనస్‌తో కలిసి పృథ్వీరాజ్ నటిస్తున్నారు. ఈ భారీ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
