Site icon TeluguMirchi.com

Priyadarshi: “ట్రోలింగ్స్, ద్వేషాలను దాటి గెలిచాం!” ప్రియదర్శి

Priyadarshi

Priyadarshi: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన తాజా సంచలనం ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా విజయోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా ములాఖత్‌లో టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి మాట్లాడిన మాటలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తీవ్ర జ్వరం, కంటి మంటలతో బాధపడుతూనే సక్సెస్ మీట్‌కు హాజరైన ప్రియదర్శి.. సినిమాపై జరిగిన కుట్రలు, నెగెటివిటీని నేరుగా ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమా రిలీజ్ సమయంలో ఎదురైన ప్రతికూలతలపై ప్రియదర్శి ఓపెన్ అయ్యారు. “ఒక నటుడిగా నన్ను నేను రీ-ఇన్వెంట్ చేసుకోవాలనే కసి నాలో ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమా కోసం చిత్ర బృందం ప్రాణం పెట్టి పనిచేసింది. కానీ విడుదల సమయంలో ఎంతో నెగెటివిటీని సృష్టించారు. లెక్కలేనన్ని ట్రోలింగ్స్, హేట్రెడ్, ద్వేషాలను ఎదుర్కొన్నాం. వాటన్నింటినీ దాటుకుని, ప్రజల హృదయాల్లోకి ఈ సినిమా నేరుగా చొచ్చుకుపోయింది. ఇప్పుడు థియేటర్లలో జనం ఇచ్చే రెస్పాన్స్ చూస్తుంటే ఆ ట్రోల్స్ అన్నీ కొట్టుకుపోయాయి” అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

ఈ సినిమాలో తాను పోషించిన ‘శంకరన్న’ పాత్ర గురించి చెబుతూ.. “డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఫోన్ చేసి ఈ రోల్ చేయాలనగానే లోలోపల చాలా భయం వేసింది. అంతటి రా అండ్ రస్టిక్ పాత్రను మోయగలనా అని సందేహం వచ్చింది. కానీ భయం ఉన్నచోటే అసలైన ఛాలెంజ్ ఉంటుందని రంగంలోకి దిగాను. ‘కోర్ట్’ సినిమాలో సూర్యతేజ రోల్ తర్వాత నాకు ఆ స్థాయి పేరు, అంతటి హైప్ తెచ్చిన పాత్ర ఇదే. అప్పుడు నా పక్కన నాని అన్న ఉన్నాడు, ఇప్పుడు కూడా నాని అన్నే ఉన్నాడు” అని గుర్తుచేసుకున్నారు. శంకరన్న పాత్ర సహజంగా రావడం వెనుక ఉన్న శ్రమను ప్రియదర్శి బయటపెట్టారు. “శంకరన్న పాత్రను ఏదో ఆషామాషీగా తెరపైకి తీసుకురాలేదు. ఎంతో రీసెర్చ్, వర్క్ జరిగింది. శంకరన్న వేసుకునే బట్టల కోసం అబిడ్స్‌లో వెతికారు. ప్రత్యేకమైన వాచ్, చెప్పులు, ప్రాస్థెటిక్స్ మేకప్ వాడాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ పాత్రకు అవసరమైన స్లాంగ్, డైలాగ్ డెలివరీ కోసం బిత్తిరి సత్తి (చేవెళ్ల రవి) దగ్గర ప్రత్యేకంగా కోచింగ్ తీసుకున్నాను” అని వెల్లడించారు.

సినిమాలో పనిచేసిన టాప్ టెక్నీషియన్లను కొనియాడుతూ.. “నాని అన్న పక్కనుంటే అందరికీ మంచి జరుగుతుంది. ఆయన ఒక్కడే పరిగెత్తడు.. అందరినీ వెంటేసుకుని నడుస్తాడు. అనిరుధ్ సంగీతం, శ్యామ్ కాసర్ల లిరిక్స్, జంగిరెడ్డి గాత్రం.. సాధారణంగా నేను సోలోగా చేసే సినిమాల్లో ఇంతటి లెజెండరీ టెక్నీషియన్లను పెట్టుకునే బడ్జెట్ లేదా స్థాయి నాకు ఉండకపోవచ్చు. కానీ నాని అన్న, సుధాకర్ అన్నల వల్ల నాకు ఇంత గొప్ప టీమ్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కింది” అని వినమ్రంగా చెప్పారు. మోహన్ బాబు వంటి లెజెండ్ పక్కన కూర్చోవడమే ఒక థ్రిల్ అని, ఆయన ఎప్పటికీ తరగని స్ఫూర్తి అని పేర్కొన్న ప్రియదర్శి.. ఎన్ని విమర్శలు, నెగెటివ్ ప్రచారాలు వచ్చినా చివరకు కంటెంటే గెలిచిందని గర్వంగా స్పష్టం చేశారు.

Exit mobile version