
Priyanka Chopra: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు – గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న సినిమా ‘వారణాసి’. ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. వారణాసి సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇది కేవలం ఇండియన్ మూవీ లవర్స్‌నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులను అలరించనుందని స్పష్టం చేశారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. “మేము ఇప్పుడు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఇటీవలి కాలంలో ఎవరూ చూడని విధంగా, ఊహించని భారీ స్థాయిలో దీన్ని రూపొందిస్తున్నాం. గత మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసమే మేము పని చేస్తున్నాం. ఇందులో నేను భాగమైనందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇది కేవలం భారతదేశం కోసమే కాదు, యావత్ ప్రపంచం కోసం తెరకెక్కుతుంది. దీనిని గ్లోబల్ స్థాయిలో అత్యంత భారీగా రిలీజ్ చేయబోతున్నారు” అని వెల్లడించారు. ప్రియాంక చోప్రా స్వయంగా ఈ స్థాయిలో ప్రాజెక్ట్ గురించి మాట్లాడటంతో, ‘వారణాసి’ చుట్టూ తిరిగే ఆ కథ ఏమై ఉంటుంది? ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అని సూపర్ స్టార్ అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు వెలువడే అవకాశం ఉంది.
