
Radhika Apte: బోల్డ్ పాత్రలతో, విలక్షణమైన నటనతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే. అయితే, గతం ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉంది. తెరపై ఎంత ధైర్యంగా కనిపించినా, నిజ జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవం తనను ఎంతటి భయాందోళనలకు గురిచేసిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారమే. ‘లస్ట్ స్టోరీస్ 3’ చర్చల సందర్భంగా గతంలో జరిగిన పర్సనల్ వీడియో లీక్ ఉదంతాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారాయి. వీడియో లీక్ అయిన సమయంలో తాను ముంబైలో ఒంటరిగా నివసిస్తున్నానని, ఆ క్షణంలో తన భద్రతపై తీవ్రమైన భయం మొదలైందని రాధికా ఆప్టే వెల్లడించారు. సమాజం నుంచి వచ్చే సూటిపోటి చూపుల కంటే, తన ఇంట్లో ప్రతిరోజూ పనిచేసే వ్యక్తుల రియాక్షన్ తనను ఎక్కువగా కలవరపెట్టినట్లు వెల్లడించారు.
చివరకు ధైర్యం చేసి, తన డ్రైవర్, వాచ్‌మన్‌లను నేరుగా పిలిచి నిలదీసినట్లు చెప్పారు. తన పర్సనల్ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా వారు తనను గౌరవిస్తారా? ఒంటరిగా ఉంటున్న తనకు రక్షణగా నిలబడతారా? లేదా వారి ఆలోచనల్లో ఏదైనా మార్పు వచ్చిందా? అనే సందేహాన్ని నేరుగా వారి ముందే పెట్టినట్లు వెల్లడించారు. అయితే, ఆ ఇద్దరూ ఆమెకు ఇచ్చిన భరోసా ఆ క్లిష్ట సమయంలో ఆమెకు కొండంత అండగా నిలిచిందన్నారు. ఎలాంటి సంకోచం లేకుండా ఆమె పట్ల విధేయతతో ఉంటామని, ఆమె భద్రతకు ఏ ఢోకా ఉండదని స్పష్టం చేయడంతో రాధిక ఊపిరి పీల్చుకున్నారట. రాధికా ఆప్టే చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఒక నటిగా స్క్రీన్‌పై కనిపించే వ్యక్తిత్వానికి, నిజ జీవితంలో వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య ఉండే సరిహద్దులపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
అయితే ఈ వ్యవహారంపై భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ‘లస్ట్ స్టోరీస్ 3’ చర్చలు సాగుతున్న తరుణంలోనే, ఎప్పుడో ముగిసిపోయిన పాత వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవడం కేవలం పబ్లిసిటీ కోసమేనా అనే అనుమానాలను కొందరు లేవనెత్తుతున్నారు. ప్రాజెక్ట్ హైప్ కోసమే సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా, డిజిటల్ యుగంలో సెలబ్రిటీల ప్రైవసీ ఎంత ప్రమాదంలో పడుతుందో, ఆ ప్రభావం వారి మానసిక స్థైర్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో రాధికా ఆప్టే బయటపెట్టిన ఈ చేదు నిజం మరోసారి కళ్లకు కట్టింది.
