Site icon TeluguMirchi.com

Raghava Lawrence: రాజకీయాలపై రాఘవ లారెన్స్ క్లారిటీ.. సీఎం విజయ్ స్థానం నుంచి పోటీ చేయట్లేదు కానీ..!

Raghava Lawrence

Raghava Lawrence: డ్యాన్స్ మాస్టర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకూ తెరదించారు. తమిళ సూపర్ స్టార్, ప్రస్తుత సీఎం విజయ్ రాజీనామా చేసిన ‘తిరుచ్చి ఈస్ట్’ నియోజకవర్గం నుంచి లారెన్స్ పోటీ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా రూమర్స్ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా లారెన్స్ ఒక ప్రత్యేక వీడియో ద్వారా తన పొలిటికల్ స్టాండ్‌ను స్పష్టం చేశారు. సీఎం విజయ్ తప్పుకున్న తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి తాను పోటీ చేయడం లేదని ఈ సందర్భంగా లారెన్స్ క్లారిటీ ఇచ్చారు. ఆ స్థానంలో పోటీ చేయకపోవడానికి గల కారణాన్ని ఆయన వివరించారు.

విజయ్ పార్టీ (TVK) కోసం మొదటి నుంచి కష్టపడిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారని, ఆ సీటు వారిలో ఎవరికైనా దక్కాలి కానీ, తాను మధ్యలో వచ్చి పోటీ చేయడం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు. అయితే, తాను ఎన్నికల్లో పోటీ చేయనని మాత్రమే చెప్పానని.. రాజకీయాల్లోకి రావట్లేదని చెప్పలేదని లారెన్స్ ట్విస్ట్ ఇచ్చారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానని, అయితే ఒక సాధారణ కార్యకర్తలాగా గ్రౌండ్ లెవెల్ నుంచి 3-4 ఏళ్లు కష్టపడి, మెల్లమెల్లగా అడుగులు వేస్తానని స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరాలనేది త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు. తన తల్లి కూడా రాజకీయాల్లోకి రావద్దని వారించినా.. సేవా దృక్పథంతోనే ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు. ప్రస్తుతానికి తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని లారెన్స్ వెల్లడించారు. లోకేష్ కనగరాజ్ సమర్పణలో వస్తున్న ‘బెంజ్’ చిత్రంతో పాటు తన బ్లాక్‌బస్టర్ సిరీస్ ‘కాంచన 4’ సినిమాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. సినిమాలు చేస్తూనే.. తన ట్రస్ట్ ద్వారా గత 20 ఏళ్లుగా అందిస్తున్న సామాజిక సేవలను యథావిధిగా కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. లారెన్స్ ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి ప్రస్తుతానికి తప్పుకోవడంతో ఆయన అభిమానులు ఒకింత నిరాశకు గురైనప్పటికీ, భవిష్యత్తు పొలిటికల్ ఎంట్రీపై ఇచ్చిన క్లారిటీతో కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకుంది.

Exit mobile version