Site icon TeluguMirchi.com

Rahul Sankrityan: రెండు షెడ్యూల్స్ అయ్యాక అసలు విషయం చెప్పాడు: డైరెక్టర్ రాహుల్

Rahul Sankrityan

Rahul Sankrityan: టాలీవుడ్ మోస్ట్ క్రేజీ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ప్రేమ, పెళ్లి ముచ్చట్లపై నిత్యం నెట్టింట ఏదో ఒక బజ్ నడుస్తూనే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ‘రణబాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఇద్దరి రియల్ లైఫ్ పెళ్లి గుట్టు ఎప్పుడు బయటపడిందో రివీల్ చేస్తూనే, సినిమా వెనుక ఉన్న 250 ఏళ్ల నాటి భయానక చరిత్రను ఆయన బయటపెట్టారు.

‘రణబాలి’, ‘జయమ్మ’ పాత్రల గురించి చెబుతూ రాహుల్ ఒక ఫన్నీ అండ్ షాకింగ్ నిజాన్ని పంచుకున్నారు. సినిమా ప్రాజెక్ట్ మొదలైనప్పుడు వాళ్లిద్దరూ నిజ జీవితంలో ఒక్కటి కాబోతున్నారన్న విషయం తనకు కలలో కూడా తెలీదట. రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఒకరోజు విజయ్ స్వయంగా వచ్చి.. “మేము పెళ్లి చేసుకోబోతున్నాం” అనే బాంబు పేల్చాడట. అసలు ట్విస్ట్ ఏంటంటే.. వాళ్లు బయట ప్రపంచానికి పెళ్లి విషయం చెప్పడానికి ముందే, సినిమాలో వాళ్లిద్దరికీ పెళ్లి జరిపించి భార్యాభర్తలుగా చూపించేశారు రాహుల్. ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ పోస్టర్‌ చూసి సెట్‌లో ఉన్నవారంతా ముచ్చటపడ్డారని తెలిపారు. అంతేకాదు, ఎప్పుడూ క్యూట్, బబ్లీగా కనిపించే రష్మిక.. ఈ చిత్రంలో నటనతో విశ్వరూపం చూపించిందని ప్రశంసించారు.

సినిమా కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ రాహుల్ కాస్త ఎమోషనల్ అయ్యారు. అన్నం, ఆకలి అనే కీలక అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుందని చెప్పారు. సృష్టికి చైతన్యాన్ని ఇచ్చే ఆకలిని ఒకడు ఆయుధంగా మార్చుకుని, మన నేలను ఏకంగా 250 ఏళ్ల పాటు ఎలా పాలించాడో ఇందులో చూపించామన్నారు. రీసెర్చ్ చేస్తున్నప్పుడు వెలుగుచూసిన దారుణమైన నిజాలు తనను తీవ్రంగా కలచివేశాయని, ఏ చరిత్ర పుస్తకాల్లోనూ రాయని ఆ చేదు వాస్తవాలను సమాజానికి చెప్పాలనే నాలుగేళ్లు కష్టపడి ఈ కథను రాసుకున్నట్లు వివరించారు.

గతంలో ‘టాక్సీవాలా’తో విజయ్‌కు మంచి హిట్ ఇచ్చిన రాహుల్.. ఇందులో విజయ్ పాత్ర అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కథ రాస్తున్నప్పుడే ఒక నిజమైన పౌరుషం ఉన్న వీరుడు కావాలనిపించాడని, ఆ కటౌట్ విజయ్ దగ్గరే దొరికిందని చెప్పారు. గుర్రంపై స్వారీ చేస్తూ, రాయలసీమ యాసలో విజయ్ చెప్పిన సంభాషణలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయన్నారు. హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ ఓస్లు విలనిజం, అజయ్-అతుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని చెప్పారు. సెన్సార్ నుంచి ‘U/A’ సర్టిఫికేట్ తెచ్చుకున్న ఈ 170 నిమిషాల ఎమోషనల్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16న థియేటర్లలోకి రానుంది.

Exit mobile version