Site icon TeluguMirchi.com

Rajinikanth Dharman: ఆ ప్రచారంపై రంగంలోకి దిగిన తలైవా టీమ్‌!

Rajinikanth Dharman

Rajinikanth Dharman: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా చుట్టూ మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. కమల్‌హాసన్‌ నిర్మిస్తున్న ‘ధర్మన్‌’ షూటింగ్‌లో రజనీకి, దర్శకుడు అశ్వత్‌ మారిముత్తుకు మధ్య విభేదాలు వచ్చాయంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. మైసూరులో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయన్న వార్తలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి. అయితే ఈ ప్రచారంపై రజనీకాంత్‌ బృందం స్పందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సినిమా షూటింగ్‌ సజావుగా సాగుతోందని, రజనీకాంత్‌ ఉత్సాహంగా పనిచేస్తున్నారని ఆయన మేనేజర్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పష్టం చేశారు. తాను స్వయంగా చిత్రీకరణను గమనించానని పేర్కొంటూ, రజనీ-దర్శకుడి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించారు. దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు చురుగ్గా పనిచేస్తుండటంతో షూటింగ్‌ వేగంగా కొనసాగుతోందని వివరించారు. మైసూరు షెడ్యూల్‌లో గొడవలు జరిగాయంటూ ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. అయితే ఆ ఆరోపణలను చిత్రబృందం ధ్రువీకరించలేదు. తాజాగా రజనీ మేనేజర్‌ ఇచ్చిన వివరణతో ఈ ప్రచారానికి తెరపడినట్లయింది.

‘ధర్మన్‌’ ప్రాజెక్ట్‌ మొదటి నుంచీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుల మార్పుల అంశంతో ఈ సినిమా గతంలోనూ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు రజనీకాంత్‌, అశ్వత్‌ మారిముత్తు మధ్య విభేదాలంటూ ప్రచారం జరగడంతో మరోసారి ఈ ప్రాజెక్ట్‌ చర్చనీయాంశమైంది. అయితే తాజా వివరణతో అంతా సజావుగానే సాగుతోందని ఫ్యాన్ కూల్ అయ్యారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, కమల్‌హాసన్‌ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, టర్మరిక్‌ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన రజనీకాంత్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమాలో ఆయన వైద్యుడి పాత్రలో కనిపించనున్నారు. సిమ్రాన్‌, రాశీఖన్నా, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version