Site icon TeluguMirchi.com

Ram Charan: రామ్ చరణ్ హెల్త్‌పై కీలక అప్డేట్.. సర్జరీ సక్సెస్!

Ram Charan

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు కుడి చేతి మణికట్టు (రైట్ రిస్ట్) సమస్యకు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, గంగా హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ఎస్.రాజశేఖరన్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ కోసం అమెరికాలోని మయామికి చెందిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ప్రత్యేకంగా కోయంబత్తూరుకు ఆహ్వానించడం విశేషం. సాధారణంగా ఆయన అపాయింట్‌మెంట్ పొందడం కూడా చాలా కష్టమని చెబుతుంటారు. అలాంటి నిపుణుడు రామ్ చరణ్ శస్త్రచికిత్స కోసం ప్రత్యేకంగా భారత్‌కు రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

డాక్టర్ ఎస్.రాజశేఖరన్, డాక్టర్ అలెహాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్‌తో పాటు నిపుణులైన వైద్యుల బృందం కలిసి ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు చెబుతున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి నిర్వహించిన క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను కూడా డాక్టర్ రాజశేఖరన్ విజయవంతంగా పూర్తి చేయడం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. అయితే ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలపై రామ్ చరణ్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అభిమానులు ఆయన త్వరగా కోలుకుని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు.

Exit mobile version